కల్వకుంట్ల తారక రామారావు(KTR)కు సుప్రీంకోర్టులోనూ ఊహించని పరిణామం ఎదురైంది. ఆయన కేసుపై తక్షణ విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ACB కేసును కొట్టివేయాలంటూ ఆయన వేసిన క్వాష్ పిటిషన్ విచారణను స్వీకరించినా తక్షణ విచారణ అవసరం లేదంటూ చీఫ్ జస్టిస్(CJI) ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ క్వాష్ పిటిషన్ పై ఈ నెల 15న విచారణ చేపడతామని బెంచ్ తెలిపింది. ఫార్ములా ఈ-కార్ రేసు విషయంలో ACB నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ క్వాష్ పిటిషన్ వేస్తూ శుక్రవారం విచారణకు స్వీకరించాలని ఆయన తరఫు న్యాయవాది కోరారు. కానీ అందుకు చీఫ్ జస్టిస్ బెంచ్ నిరాకరిస్తూ 15వ తేదీనే విచారణ చేపడతామని స్పష్టతనిచ్చింది.
ఇప్పటికే ఆయనకు హైకోర్టులో వ్యతిరేక ఫలితం రాగా, ఎలాగైనా సుప్రీంకోర్టుకు KTR వెళ్తారన్న ఉద్దేశంతో ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానంలో కేవియట్ పిటిషన్ వేసింది. ఒకవేళ KTR పిటిషన్ వేస్తే తమ వాదనలు కూడా వినాలన్నది కేవియట్ పిటిషన్ అంతరార్థం. సర్కారు ఊహించినట్లుగానే ఈ మాజీ మంత్రి సుప్రీం మెట్లెక్కడంతో ఇక అందుకు సంబంధించిన వాద, ప్రతివాదనలు జరగనున్నాయి.