మణిపూర్ అమానవీయ ఘటనను దేశ సర్వోన్నత న్యాయస్థానం(supreme court) సుమోటో(తనంత తాను)గా తీసుకుంది. బయటకు వచ్చిన వీడియోల వల్ల ప్రజలు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారని పేర్కొంది. ఇలాంటి ఘటన ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదని.. ఇది రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుందని స్పష్టం చేస్తూ దీనిపై ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలంటూ కేంద్రంతోపాటు మణిపూర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై సుప్రీం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీచేసింది.
వర్గ కలహాలు జరుగుతున్న మణిపూర్ లో మహిళల్ని టార్గెట్ గా చేసుకుని దాడులకు పాల్పడటం సరికాదన్న సుప్రీంకోర్టు.. అది రాజ్యాంగ దుర్వినియోగంలో అత్యంత దారుణమని CJI జస్టిస్ DY చంద్రచూడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వీడియోల వల్ల తాము తీవ్ర ఆందోళనకు గురయ్యామన్న ఆయన.. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే తామే రంగంలోకి దిగుతామని హెచ్చరించారు. నేరస్థులపై ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించారు.