‘నీట్-యూజీ 2024’ పరీక్షల క్వశ్చన్ పేపర్ లీక్ నిజమేనని విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు సంచలన కామెంట్స్ చేసింది. లీకైన పేపర్ ఇద్దరికే వెళ్లిందంటున్నారు.. కానీ అది ఎంతమందికి చేరిందో తేలాల్సి ఉంది.. అని అభిప్రాయపడింది.
పేపర్ లీక్ అనేది 23 లక్షల మంది భవిష్యత్తుతో కూడిన అంశమన్న సర్వోన్నత న్యాయస్థానం.. దీన్ని క్షుణ్నంగా పరిశీలించిన తర్వాతే తుది తీర్పు ఇస్తామని స్పష్టం చేసింది. ఇప్పటివరకు లీకేజీలో భాగస్వామ్యమైన వారి పట్ల ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని కేంద్రాన్ని ఆదేశించింది.
పేపర్ లీకేజీపై దర్యాప్తు కొనసాగాల్సిందేనని చెప్పిన సుప్రీం.. 1,563 మందికి ఒకేలా మార్కులు ఎలా వస్తాయని ప్రశ్నించింది. ఇప్పటివరకు సాగించిన విచారణపై బుధవారం లోగా నివేదిక అందజేయాలంటూ 38 పిటిషన్లను విచారిస్తున్న బెంచ్ CBIని ఆదేశించింది.
చీఫ్ జస్టిస్(CJI) డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ జె.బి.పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.