జమ్మూకశ్మీర్ ప్రజల అభిప్రాయం తీసుకోకుండా ‘ఆర్టికల్ 370’ రద్దు చేశారని, ఇది రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనంటూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు వెలువరించింది. ‘ఆర్టికల్ 370’ రద్దు ద్వారా ప్రత్యేక హోదాను కోల్పోవడం.. రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడంపై దాఖలైన పిటిషన్ పై స్పష్టతనిచ్చింది. ‘రిఫరెండం’ నిర్వహించాలన్న వినతిని తోసిపుచ్చుతూ బ్రెగ్జిట్ మాదిరిగా ‘రిఫరెండం’ ప్రశ్నే లేదని కరాఖండీగా చెప్పేసింది. జమ్మూకశ్మీర్ కు చెందిన నేషనల్ కాన్ఫరెన్స్ లీడర్ మహ్మద్ అక్బర్ లాన్ వేసిన పిటిషన్ పై మంగళవారం విచారణ జరిగింది. ‘ఆర్టికల్ 370’ రద్దు సమయంలో జమ్మూకశ్మీర్ ప్రజల అభిప్రాయాలు తీసుకోలేదని, రాష్ట్రానికి కల్పించిన శాశ్వత హోదాను ‘ఆర్టికల్ 370’ రద్దు ద్వారా కోల్పోవాల్సి వచ్చిందని పిటిషన్ లో పేర్కొన్నారు. కేసును వాదిస్తున్న సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్.. జమ్మూకశ్మీర్ కు సంబంధించిన అంశాల్ని చదివి వినిపించారు. ఆనాడు ముఖ్యమంత్రి హోదాలో షేక్ అబ్దుల్లా చేసిన ప్రసంగాన్ని కోర్టు ముందు సిబల్ చదివి వినిపించారు.
‘జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక అసెంబ్లీని ఏర్పాటు చేయాలని భారత రాజ్యాంగం స్పష్టంగా ఆదేశించింది’.. రాష్ట్రానికి సంబంధించి పూర్తి అధికారాలను కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.. రాజ్యాంగంలో పేర్కొన్న శాశ్వత నిబంధన ఆనాడు షేక్ అబ్దుల్లా మాటల్లో ప్రతిధ్వనించింది’ అని కపిల్ సిబల్ కోర్టుకు వివరించారు. భారతదేశానికి సంబంధించి రాష్ట్రాల సంబంధాలను నిర్ణయించడంలో జమ్మూకశ్మీర్ ను పదే పదే ప్రస్తావించడాన్ని సిబల్ గుర్తు చేశారు. ఇతర రాష్ట్రాలు అర్థ సమాఖ్య(క్వాసీ-ఫెడరల్) కలిగి ఉన్నప్పటికీ జమ్మూకశ్మీర్ మాత్రం నిజమైన, పూర్తి సమాఖ్యగా కొనసాగుతున్నదని తెలియజేశారు. ఇందుకు ప్రధాన కారణం రాష్ట్ర అసెంబ్లీకి విశేష అధికారాలు ఉండటమేనని కోర్టుకు తెలిపారు. భారత రాజ్యాంగం ఇలాంటి అవశేష అధికారాలు కల్పించడం వల్లే జమ్మూకశ్మీర్ ప్రత్యేక హోదాను కొనసాగించిందని సుప్రీంకోర్టుకు వివరించారు.