ఇద్దరు సంతానం కన్నా ఎక్కువ ఉంటే ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులే అంటూ దేశ సర్వోన్నత న్యాయస్థానం(Supreme Court) క్లారిటీ ఇచ్చింది. 2001లో రాజస్థాన్ సర్కారు తెచ్చిన వేరియస్ సర్వీస్ నియమాలను సమర్థించింది. ఇద్దరు పిల్లల నిబంధన వివక్షతో కూడుకున్నది కాదంటూనే కుటుంబ(Family) నియంత్రణ(Planning)ను ప్రోత్సహించడమేనంటూ పిటిషన్ తిరస్కరించింది.
కేసు వివరాలిలా…
రాజస్థాన్ కు చెందిన రామ్ జీ లాల్ జాట్ అనే వ్యక్తి సైన్యంలో పనిచేస్తూ 2017లో రిటైర్ అయ్యారు. ఆ తర్వాత కానిస్టేబుల్(Constable) ఉద్యోగం కోసం 2018లో అప్లయ్ చేసుకున్నారు. రామ్ జీకి ఇద్దరు కంటే ఎక్కువ సంతానం ఉండటంతో ఆయన దరఖాస్తును అధికారులు తిరస్కరించారు. దీనిపై ఆయన కోర్టును ఆశ్రయిస్తే ఆ పిటిషన్ ను 2022లో రాజస్థాన్ హైకోర్టు కొట్టివేసింది. ఇది విధానపర నిర్ణయమంటూ అందులో తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రామ్ జీ.. సుప్రీంకోర్టు మెట్లెక్కారు.
అక్కడా అదే సీన్…
ఈ అంశంపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు… ఇద్దరు పిల్లల నిబంధనను సమర్థించింది. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల కోసం ఈ రూల్ తీసుకువస్తే గతంలోనే తాము దాన్ని ఆమోదించినట్లు కోర్టు గుర్తు చేసింది. ఈ నిబంధన(Rule) అనేది రాజ్యాగ ఉల్లంఘన కిందకు రాదంటూ కుటుంబ నియంత్రణను ప్రోత్సహించే లక్ష్యంతోనే దీన్ని అమలు చేస్తున్నట్లు రాజస్థాన్ సర్కారు నిర్ణయాన్ని సమర్థించింది.
రాజస్థాన్ పోలీస్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1989 ప్రకారం… 2002 జూన్ 1 తర్వాత ఇద్దరి కంటే ఎక్కువ సంతానం కలిగిన వ్యక్తులు సర్కారీ ఉద్యోగాలకు అనర్హులు. ఆ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో ఈ ‘ఇద్దరు పిల్లల’ నిబంధనను అమలు చేస్తూ రాజస్థాన్ వేరియస్ సర్వీస్ రూల్స్ చట్టానికి 2001లో సవరణలు చేశారు.