కన్వడ్(Kanwar) యాత్ర సందర్భంగా దాబాలు, రెస్టరెంట్లు సహా అన్ని రకాల దుకాణాల(Shops) బోర్డులపై యజమానుల పేర్లను పెద్ద అక్షరాలతో రాయాలన్న ఆర్డర్స్ పై సుప్రీంకోర్టు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. UPతోపాటు ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాలను నోటీసులు జారీ చేసింది.
ముజఫర్ నగర్లో ఈ నెల 20న మున్సిపాల్టీ అధికారులు దీనిపై ఆదేశాలిచ్చారు. ఏటా శ్రావణమాసంలో లక్షల సంఖ్యలో భక్తులు కన్వడ్ యాత్రలో భాగంగా ఈ పట్టణం నుంచే హరిద్వార్ వెళ్లి గంగానది నీటిని తీసుకొస్తారు.
కన్వడ్ యాత్ర మతపరమైనందున భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉత్తర్వులు ఇచ్చినట్లు యంత్రాంగం చెబితే.. ముస్లింలను వేరు చేసే ప్రయత్నమంటూ విమర్శలు వచ్చాయి. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పలువురితోపాటు తృణమూల్(TMC) MP మహువా మొయిత్రా పిటిషన్ వేశారు.
జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ ఎస్.వి.ఎన్.భట్ తో కూడిన ద్విసభ్య ధర్మాసనం(Bench) విచారణకు స్వీకరించి ఆ ఆదేశాలపై స్టే విధించింది. జులై 26న జరిగే తదుపరి విచారణలోపు సమాధానమివ్వాలంటూ UP సర్కారుకు నోటీసులిచ్చింది.