కళాశాలల్లో NRI కోటా అంటేనే పెద్ద మోసమని(Fraud) సుప్రీంకోర్టు విస్పష్ట తీర్పునిచ్చింది. MBBS అడ్మిషన్లలో కొత్తగా తెచ్చిన నిబంధనల్ని రద్దు చేస్తూ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ రాష్ట్ర అప్పీల్ ను కొట్టివేసింది. ప్రవాస భారతీయుల(NRI) బంధువులు ప్రత్యేక కోటా కింద MBBS కోర్సుల్లో అడ్మిషన్ పొందేందుకు రూల్స్ సరళతరం చేస్తూ ఆగస్టు 20న పంజాబ్ సర్కారు నోటిఫికేషన్ ఇచ్చింది. ఇది దుర్వినియోగానికి దారులు తెరుస్తుందంటూ పంజాబ్-హరియాణా హైకోర్టు నోటిఫికేషన్ ను రద్దు చేసింది.
హిమాచల్ ప్రదేశ్, UP తరహాలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని పంజాబ్ న్యాయవాది వాదించారు. దీనిపై చీఫ్ జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ జె.బి.పార్దివాలా తీవ్రంగా స్పందించారు. ‘NRIకి బంధువని చెబితే అడ్మిషన్ ఇవ్వడమేనా.. ఇది కేవలం రాష్ట్రం ద్వారా డబ్బు దోచుకునే వ్యవహారం..’ అని CJI అన్నారు. ‘NRI కోటా అనే మోసపూరిత వ్యాపారాన్ని ఇప్పుడే ఆపాలి.. దీనివల్ల ఎక్కువ మార్కులు వచ్చినవాళ్లకూ అడ్మిషన్ దొరకదు.. విద్యావ్యవస్థకు మనం చేస్తున్నది ఇదేనా..’ అని జస్టిస్ జె.బి.పార్దివాలా ప్రశ్నించగా ధర్మాసనం సంచలన తీర్పునిచ్చింది.