గ్రూప్-1 రద్దు చేయాలన్న అంశంపై సర్వోన్నత న్యాయస్థానం(Supreme Court) సంచలన తీర్పునిచ్చింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట(Relief) కలిగిస్తూ నోటిఫికేషన్ రద్దు చేయడం కుదరదని విస్పష్టంగా తేల్చిచెప్పింది. కొత్త నోటిఫికేషన్ అనేది చట్టవిరుద్ధంగా భావించి నోటిఫికేషన్ నే రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ పై జస్టిస్ నరసింహ నేతృత్వంలోని బెంచ్ విచారణ జరిపింది. 2022లో ఇచ్చిన నోటిఫికేషన్ ను పక్కనపెట్టి 2024లో కొత్త ప్రకటన ఇవ్వడం సరికాదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు. 2024 గ్రూప్-1 ప్రిలిమ్స్ లో తప్పులు కూడా భారీగా ఉన్నాయని తెలిపారు.
మెయిన్స్ వాయిదా వేయాలని పిటిషనర్లు అంతకుముందు హైకోర్టును ఆశ్రయిస్తే అక్కడా ఫలితం దక్కలేదు. కేసును కొట్టివేయడంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు మెట్లెక్కారు. పరీక్షల నిర్వహణలో కోర్టుల జోక్యం అవసరం లేదని, అలా చేస్తే ఎగ్జామ్స్ ముందుకు సాగబోవని స్పష్టం చేసింది. పిటిషనర్లెవరూ మెయిన్స్ కు క్వాలిఫై కాకపోవడంతో రద్దు అవసరం లేదని వెల్లడించింది. ఈ ఫలితాల్ని వచ్చే ఫిబ్రవరిలో విడుదల చేస్తామని గతంలోనే TGPSC ప్రకటించింది. ఈ విషయాన్నే కోర్టు ముందు ప్రస్తావించడంతో గ్రూప్-1 రద్దు అవసరం లేదని బెంచ్ అభిప్రాయపడింది.