
Published 15 Dec 2023
జ్ఞానవాపి మాదిరిగానే మరో మసీదులో సర్వే ఆపాలన్న పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీంతో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్ని సమర్థిస్తూ స్టే పిటిషన్ ను కొట్టివేసింది. ఉత్తర్ ప్రదేశ్ లోని మథుర శ్రీకృష్ణ జన్మభూమి(Sri Krishna Janma Bhoomi) ఆలయ ప్రాంగణంలో గల షాహీ ఈద్గా మసీదులో నిజానిజాల్ని వెలికి తీసేందుకు శాస్త్రీయ సర్వే చేపట్టవచ్చంటూ అలహాబాద్ న్యాయస్థానం ఈనెల 14న ఆదేశాలిచ్చింది. మసీదుకు పూర్వం అక్కడ శ్రీకృష్ణుని ఆలయం ఉండేదని, కానీ కాలక్రమేణా ఆ ఆనవాళ్లు కనిపించకుండా పోయాయంటూ భగవాన్ శ్రీకృష్ణ విరాజ్మాన్ కమిటీతోపాటు ఏడుగురు వ్యక్తులు పిటిషన్లు వేశారు. వీటిపై వాదనలు విన్న కోర్టు.. సర్వేకు నిన్న అనుమతిస్తూనే అది తమ పర్యవేక్షణలోనే ఉంటుందని చెప్పింది. ఇందుకోసం ముగ్గురు అడ్వొకేట్ కమిషనర్లను నియమిస్తామని, కమిషన్ విధివిధానాలు(Guidelines)ను ఈ నెల 18న జరిగే విచారణ సందర్భంగా నిర్ణయిస్తామని హైకోర్టు తెలిపింది.
సుప్రీంకోర్టు తలుపు తట్టినా..
అలహాబాద్ హైకోర్టు ఆదేశాలు ఇబ్బందికరంగా ఉన్నాయని, మథుర మసీదులో సర్వేకు అనుమతించొద్దంటూ అక్కడి మసీదు కమిటీ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీన్ని పరిశీలించిన సుప్రీం అలహాబాద్ హైకోర్టుకు ఆదేశాలను సమర్థిస్తూ మసీదు కమిటీ వేసిన పిటిషన్ ను తిరస్కరించింది.
ఏమిటీ జ్ఞానవాపి సర్వే…
ఆలయ పునాదులపై మసీదు నిర్మించారన్న వాదనలపై వాస్తవాలు గుర్తించేందుకు వారణాసిలోని జ్ఞానవాపిలో సర్వే జరిగింది. శాస్త్రీయ సర్వేకు గాను ASI(ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా)కు సెషన్స్ కోర్టు అనుమతి ఇచ్చింది. కాశీ విశ్వనాథ్ ఆలయ సమీపంలోని మసీదులో ASI సర్వేకు సెషన్స్ కోర్టు ఇచ్చిన ఆదేశాల్ని సవాల్ చేస్తూ అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ వేసిన పిటిషన్ ను అలహాబాద్ హైకోర్టు రిజెక్ట్ చేసింది. జులై 21న సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించగా.. పోలీసు కమిషనర్ అశోక్ ముథా జైన్, జిల్లా జడ్జి ఎస్.రాజలింగం పర్యవేక్షణలో సర్వే నిర్వహించారు. ఆ తర్వాత దీనిపై మసీదు కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.