PG మెడికల్ సీట్ల(Medical Seats) వ్యవహారంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. నివాస ఆధారిత కోటాను రద్దు చేస్తూ రాష్ట్ర కోటా కేటాయింపులో అనుసరిస్తున్న విధానం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. గతంలో ఉన్న 50 శాతం స్థానికత కోటా ఇక కుదరదంటూ, నీట్ మెరిట్ ప్రకారమే రాష్ట్ర కోటా సీట్లు భర్తీ చేయాలని విస్పష్టంగా తెలిపింది. నివాస ఆధారిత రిజర్వేషన్లు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కు వ్యతిరేకమని అభిప్రాయపడింది. ‘మనకు దేశంలో ఎక్కడైనా నివసించే హక్కు ఉంది.. ఏ విద్యాసంస్థలోనైనా చదివే హక్కును రాజ్యాంగం కల్పించింది.. మనమంతా భారత భూభాగంలో నివసిస్తున్నాం కాబట్టి ఏ ప్రావిన్స్, ఏ రాష్ట్రమన్న ప్రశ్నే ఉత్పన్నం కాదు.. ఉద్యోగం, వ్యాపారం చేసుకునేందుకు దేశంలో ఎక్కడైనా నివసించేందుకు హక్కుంది.. అలాగే చదువుకునే హక్కు సైతం..’ అని ధర్మాసనం స్పష్టతనిచ్చింది.
ఈ రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని గతంలోనే పంజాబ్-హరియాణా కోర్టు తీర్పు ఇచ్చింది. దీన్ని సవాల్ చేయగా, ఇద్దరు సభ్యుల సుప్రీం బెంచ్ ఆ తీర్పును సమర్థించింది. అయినా కేసు ప్రాముఖ్యత దృష్ట్యా ముగ్గురు సభ్యుల ధర్మాసనానికి సిఫార్సు చేసింది. రాష్ట్రంలో నివసించే వారి విషయంలో రిజర్వేషన్ల గురించి ఆలోచించవచ్చని చెప్పింది. అయితే అది అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల వరకేనని, ఉన్నత విద్యలో నివాస ప్రాంతాన్ని ప్రాతిపదికగా తీసుకుంటే ఆర్టికల్ 14ను ఉల్లంఘించినట్లేనని జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ సుధాంశు ధులియా, జస్టిస్ ఎస్.వి.ఎన్.భట్టితో కూడిన బెంచ్ అభిప్రాయపడింది.