దేశవ్యాప్తంగా సంచలనానికి కారణమైన కామెంట్స్ పై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. సనాతన ధర్మంపై అనుచిత కామెంట్స్ చేసిన తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ కు సుప్రీంకోర్టు(Supreme Court) నోటీసులు జారీ చేసింది. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడిన ఉదయనిధి స్టాలిన్ పై దేశ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. కోట్లాది మంది మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించిన ఉదయనిధిపై చర్యలు తీసుకోవాలంటూ పిటిషనర్లు కోరారు. హిందువులు అనాదిగా ఆచరించే సనాతన ధర్మంపై అనుచితంగా మాట్లాడిన స్టాలిన్.. రెండో సారి అవే మాటల్ని రిపీట్ చేస్తూ ఎవరేం చేసుకుంటారో చేసుకోవాలంటూ వార్నింగ్ ఇచ్చారు. ఈ మాటలపై దేశవ్యాప్తంగా హిందూ సంఘాలు, ప్రజల నుంచి ఆగ్రహం కనిపించింది.
CM, మాజీ MP వత్తాసు
తమిళనాడు CM ఎం.కె.స్టాలిన్ తనయుడైన ఉదయనిధి.. ప్రస్తుతం ఆ రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. ఆయన మాట్లాడిన మాటలు తీవ్ర దుమారం రేపగా.. అన్ని వర్గాల నుంచి విమర్శలు వచ్చాయి. అయినా ఈ CM తనయుడితోపాటు ఆయన కుటుంబం ఏ మాత్రం తగ్గలేదు. ఉదయనిధిని సమర్థిస్తూ మాజీ MP ఎ.రాజా మరిన్ని వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం డెంగ్యూ వంటిదంటూ తీవ్రస్థాయిలో మాట్లాడారు. అటు తన కుమారుడిని CM స్టాలిన్ సైతం వెనకేసుకొచ్చారు. జీ20 సమావేశాల సందర్భంగా ఉదయనిధి కామెంట్స్ సంచలనంగా మారాయి. ప్రధానితోపాటు మంత్రులంతా దీనిపై మండిపడుతూ విపక్ష ఇండియా కూటమి పార్టీలు దీనిపై స్పందించకపోవడం పట్ల ఫైర్ అయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉదయనిధిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలంటూ ఏకంగా సుప్రీంకోర్టులోనే పిటిషన్ వేశారు.