చెట్టు నరకడం మనిషిని చంపడం కంటే దారుణమని, పర్యావరణానికి నష్టం కలిగించేవారిపై జాలి అవసరం లేదని సుప్రీంకోర్టు మండిపడింది. ఇకనుంచి రూ.లక్ష ఫైన్ విధించాలని ఆదేశించింది. అనుమతి లేకుండా చెట్లు నరికే అర్హత లేదంటూ జస్టిస్ అభయ్ ఎస్.ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ బెంచ్ తెలిపింది. తాజ్ ట్రాపిజియం జోన్లో ఒక వ్యక్తి 2024 సెప్టెంబరు 18న 454 వృక్షాలు నరికిన ఘటనపై పిటిషన్ దాఖలైంది. సరైన శిక్ష విధించాలని కోర్టు సహాయకుడు(అమికస్ క్యూరీ) ADN రావు కోరారు. శివశంకర్ అగర్వాల్ అనే వ్యక్తికి సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ(CEC).. చెట్టుకో లక్ష చొప్పున రూ.4.54 కోట్ల ఫైన్ వేసింది. దీన్ని తగ్గించాలంటూ అతడి న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదించారు. పిటిషనర్ క్షమాపణలు చెప్పడమే కాకుండా బదులుగా చెట్లు నాటుతారని కోర్టుకు తెలిపారు. జరిగిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం.. ఈ పిటిషన్ ను తిరస్కరించింది.