ఎన్నికల బాండ్ల(Electoral Bonds)తో ఏటా వందల కోట్ల రూపాయలు తీసుకుంటున్న రాజకీయ పార్టీల(Political Parties)కు సుప్రీంకోర్టు చెక్ పెట్టింది. ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ ను కొట్టివేస్తూ రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పునిచ్చింది. దీనిపై ఏర్పాటైన ఐదుగురు సభ్యుల ధర్మాసనం.. ఈ పథకాన్ని కొట్టివేస్తూ ఏకగ్రీవంగా తీర్పునిచ్చింది. ఎన్నికల బాండ్ల జారీని రాజ్యాంగ విరుద్ధంగా భావించిన సర్వోన్నత న్యాయస్థానం… వాటిని తక్షణమే నిలిపివేయాలని స్పష్టం చేసింది. చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ జె.బి.పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా ధర్మాసనం ఈ మేరకు తీర్పును ప్రకటించింది.
సమాచార, వాక్ స్వాతంత్ర్యాలకు దెబ్బ…
ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన వివరాలు మార్చి 6 కల్లా సమర్పించాలని, మార్చి 13 కల్లా వాటి వివరాల్ని వెల్లడించాల్సిందేనని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. సమాచార హక్కు చట్టం(RTI), వాక్ స్వాతంత్ర్యం, భావ వ్యక్తీకరణ హక్కులను ఈ పథకం హరించివేస్తుందని రాజ్యాంగ ధర్మాసనం(Constitution Bench) అభిప్రాయపడింది. ఇది ఆదాయ పన్ను చట్టాన్ని ఉల్లంఘించడమేనని, రాజకీయ పార్టీలకు ఆర్థిక సాయం అనేది క్విడ్ ప్రోకో(నీకిది-నాకది)కి దారితీసుందని తెలిపింది. రైట్ టూ ఇన్ఫర్మేషన్ యాక్ట్ లోని 19(1)(a)ని ఉల్లంఘించడమేనని, విరాళాలు ఇచ్చిన వారి పేర్లను రహస్యంగా ఉంచడం తప్పు అంటూనే, బ్లాక్ మనీ నియంత్రణకు బాండ్ల జారీ ఒక్కటే దారి కాదని గుర్తు చేసింది.
ఆరేళ్ల నుంచి ఇదే పని…
ఎలక్టోరల్ బాండ్ల జారీ స్కీమ్ ను 2018 జనవరి 2 నుంచి అమల్లోకి తెచ్చారు. ఈ బాండ్లను వ్యతిరేకిస్తూ ADR, CPMతోపాటు జయా ఠాకూర్ పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లపై సుదీర్ఘ విచారణ నిర్వహించిన బెంచ్.. గత నవంబరులో తీర్పును రిజర్వ్ చేసింది.