HCU పక్కనున్న కంచ గచ్చిబౌలి భూములపై రాష్ట్ర సర్కారుకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. హైకోర్టు రిజిస్ట్రార్ సమర్పించిన నివేదికను పరిశీలించిన బెంచ్.. ప్రభుత్వం తీరుపై మండిపడింది. ఇకపై ఎలాంటి చర్యలు చేపట్టకుండా చీఫ్ సెక్రటరీ(CS)ని ప్రతివాదిగా చేర్చాలని, భవిష్యత్తులో ఎలాంటి ఉల్లంఘనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత CSదేనని స్పష్టం చేసింది. ఏదైనా జరిగితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించింది. అది అటవీ, పర్యావరణ భూమి కాదని ప్రభుత్వానిదేనని సర్కారు తరఫు న్యాయవాది వాదించారు. అయినా కేంద్ర పర్యావరణ విభాగం అనుమతులుండాలని, దీనిపై అంత ఉత్సాహమెందుకంటూ ప్రశ్నించింది. సర్కారు అత్యుత్సాహం చూస్తే CSపై చర్యలు తీసుకోవాల్సి ఉందని జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ మసీహ్ బెంచ్ ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ తదుపరి విచారణ ఈ నెల 16కు వాయిదా వేసింది.
బెంచ్ ఏం చెప్పిందంటే…
‘ఆ భూముల్లో ఎలాంటి చర్యలు చేపట్టొద్దు.. అత్యవసరంగా కార్యకలాపాలు చేపట్టాల్సిన అవసరం ఏమొచ్చింది.. చట్టాన్ని ఎలా చేతుల్లోకి తీసుకుంటారు.. ఇది చాలా తీవ్రమైన అంశం.. చెట్ల నరికివేతకు అనుమతులున్నాయా.. 100 ఎకరాల్లో చెట్ల కొట్టివేత అంత సామాన్యమైన విషయం కాదు.. ప్రభుత్వం మార్చి 15న వేసిన కమిటీలోని సభ్యులు సమాధానమివ్వాలి..’.