లిక్కర్ కుంభకోణంలో MLC కవితకు జారీ చేసిన ED నోటీసులపై ఆమెకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ నెల 26 వరకు కల్వకుంట్ల కవితకు సమన్లు జారీ చేయవద్దని ఈడీకి ఆదేశాలిచ్చింది. నళిని చిదంబరం తరహాలో తనకూ ఊరటనివ్వాలని తన తరఫు లాయర్ల ద్వారా ఆమె సర్వోన్నత న్యాయస్థానం(Supreme Court)లో పిటిషన్ వేశారు. దీనిపై ఈడీ తరఫున న్యాయవాదిని కోర్టు వివరణ కోరింది. అందుకు తమకెలాంటి అభ్యంతరం లేదని అడిషనల్ సొలిసిటర్ జనరల్(ASG) తెలపడంతో.. ఈ నెల 26 వరకు సమన్లు జారీ చేయవద్దని ఆదేశించింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో భాగంగా విచారణకు హాజరుకావాలని ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నుంచి శుక్రవారం నాడు కవితకు సమన్లు అందాయి. దీనిపై తొలుత పార్టీ లీగల్ టీమ్ తో చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకుంటామన్న ఆమె.. నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్లారు. మనీలాండరింగ్ చట్టం కింద ED సమన్లు ఇవ్వడాన్ని సవాల్ చేశారు. మహిళలను ఉన్నచోటే విచారించాలన్న CRPC సెక్షన్ 160 రూల్స్ ని ఉల్లంఘించేలా వ్యవహరించినందున వెంటనే సమన్లను రద్దు చేయాలని కోరారు.