నవజాత శిశువులు(New Born) ఆసుపత్రి నుంచి అదృశ్యమైతే లైసెన్స్ రద్దు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. పిల్లల అక్రమ రవాణా కేసుల తీరును అన్ని హైకోర్టులు తెలపాలని జస్టిస్ జె.బి.పార్దివాలా, జస్టిస్ ఆర్.మహదేవన్ ధర్మాసనం ఆదేశాలిచ్చింది. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన బెయిల్ వల్ల నిందితులు తప్పించుకున్నారంటూ ఆ నిర్ణయాన్ని తప్పుబట్టింది. ‘నిందితులు ప్రతి వారం పోలీస్ స్టేషన్లో హాజరవ్వాలన్న ఆదేశాల్ని హైకోర్టు ఇవ్వాలి.. అలా చేయకపోవడం వల్ల నిందితుల్ని ట్రాక్ చేసే అవకాశం లేకుండా పోయింది..’ అని ధర్మాసనం మండిపడింది.
రూ.4 లక్షలు ఇచ్చి బాలుణ్ని ఎత్తుకెళ్లారని గుర్తించిన న్యాయస్థానం.. అక్రమ రవాణా ద్వారా బిడ్డను పొందలేరని హెచ్చరించింది. నిందితులంతా లొంగిపోవాలని, వెంటనే జ్యుడీషియల్ కస్టడీకి పంపాల్సిందేనని తీర్పునిచ్చింది. దేశంలో ఏటా 2,000 పిల్లల అక్రమ రవాణా కేసులు నమోదవుతున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం తెలంగాణ, మహారాష్ట్ర, బిహార్‌లోనే ఎక్కువగా కేసులుంటున్నాయి.