స్వల్ప వ్యవధిలోనే దేశ సర్వోన్నత న్యాయస్థానం(Supreme Court) మానవీయ కోణానికి సంబంధించి సంచలన తీర్పులు వెల్లడించింది. తల్లిదండ్రుల సంరక్షణ, తగిన పరిహారం చెల్లించకుండా ఆస్తుల్ని తీసుకోవడం, CBI కేసుల్లో రాష్ట్రాల ప్రమేయంపై విస్పష్ట తీర్పులు ఇచ్చింది.
కన్నవారి సంరక్షణపై…:
వృద్ధాప్యంలో తల్లిదండ్రుల బాగోగులు చూసుకుంటనని నమ్మించి విస్మరించిన వ్యక్తికి ఆస్తి పొందే హక్కు లేదని సుప్రీం తీర్పునిచ్చింది. ఆస్తి పొందిన తమ కుమారుడు బాగోగుల్ని పట్టించుకోకపోవడంతో ఓ మాతృమూర్తి కోర్టును ఆశ్రయించింది. అతడికి ఇచ్చిన గిఫ్ట్ డీడ్ ను రద్దు చేసిన జస్టిస్ సి.టి.రవికుమార్, జస్టిస్ సంజయ్ కరోల్ ధర్మాసనం.. ఆ ఆస్తిపై వృద్ధ దంపతుల హక్కును పునరుద్ధరించింది. కన్నవారిని పట్టించుకోని బిడ్డల విషయంలో సత్వర విచారణ జరిపేలా 2007లో తెచ్చిన తల్లిదండ్రులు, వృద్ధుల సంరక్షణ చట్టం అండగా ఉంటుందంటూ మధ్యప్రదేశ్ కు చెందిన ఓ తల్లి కేసులో సుప్రీం స్పష్టం చేసింది.
పరిహారం ఇవ్వకుండా…:
తగినంత పరిహారం ఇవ్వకుండా ఏ ఒక్కరి ఆస్తిని తీసుకోవడానికి వీల్లేదని జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ కె.వి.విశ్వనాథన్ తో కూడిన సుప్రీం బెంచ్ స్పష్టతనిచ్చింది. రాజ్యాంగం కల్పించిన హక్కైన ఆస్తి హక్కును లాక్కోవడానికి వీల్లేదని, ప్రాథమిక హక్కుల నుంచి ఆస్తి హక్కును తొలగించినా ఆర్టికల్ 300-ఎ ప్రకారం రాజ్యాంగ హక్కుగా కొనసాగుతుందని తెలిపింది. 2005లో భూమి తీసుకుని 20 ఏళ్లుగా పరిహారం ఇవ్వకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తూ 2019 మార్కెట్ విలువ ప్రకారం పరిహారం చెల్లించాలని ధర్మాసనం ఆదేశించింది.
సీబీఐకి భారీ ఊరట…:
విచారణకు రాష్ట్రాల సమ్మతి అవసరం లేదంటూ 10 రాష్ట్రాలకు షాక్ నిచ్చిన సుప్రీం.. CBIకి భారీ ఊరటను కలిగించింది. అవినీతి కేసులో ఇద్దరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల దర్యాప్తును రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును జస్టిస్ సి.టి.రవికుమార్, జస్టిస్ రాజేశ్ బిందాల్ సుప్రీం ధర్మాసనం కొట్టివేసింది. పోస్టింగ్ లతో సంబంధం ఉండదని, వారంతా కేంద్ర ఉద్యోగులైనందున అవినీతి నిరోధక చట్టం ప్రకారం దర్యాప్తు చేయాల్సిందేనని తీర్పునిచ్చింది.