Published 21 Jan 2024
సత్యమైన(The Truth) మాటలు ఎవరికీ రుచించడం లేదని, సత్యాన్ని తప్ప అన్నింటినీ నమ్ముతున్నామని దేశ సర్వోన్నత న్యాయస్థానం(Supreme Court) అభిప్రాయపడింది. నిజాల కన్నా అబద్ధాలే(The Lies) తీపిగా ఉన్నాయని, స్వాతంత్ర్యం తర్వాత ఈ విషయంలో స్పష్టమైన మార్పు కనిపించిందని చెప్పింది. అబద్ధాలు తీయగా ఉంటున్నప్పుడు నిజాలు చేదుగానే ఉంటాయని స్పష్టం చేసింది. 40 ఏళ్లలో విలువలు దారుణంగా పడిపోయాయని, కోర్టులను తప్పుదోవ పట్టించడానికి ఎంతకైనా తెగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. శతాబ్దాలుగా భారత్ అనుసరిస్తున్న రెండు విధానాల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తుందని సుప్రీంకోర్టు తెలిపింది. ‘మనం ఇప్పుడు సత్యం తప్ప ఏదైనా విని సంతోషిస్తున్నాం.. సత్యం తప్ప ఏదైనా వినడానికి, చదవడానికి, మాట్లాడటానికి, దేన్నయినా నమ్మడానికి ఆసక్తి చూపిస్తున్నాం.. ఇది సమాజంలోని నైతిక విలువలను దిగజార్చడమే అవుతుంది అని సుప్రీం అభిప్రాయపడింది.
విద్యావ్యవస్థ వల్లేనేమో…
నిజాలను తొక్కిపెట్టడమంటే న్యాయవ్యవస్థతో ఆడుకోవడమే.. మన విద్యా వ్యవస్థ వల్లే ఇలాంటి దురవస్థ దాపురించిందేమోనంటూ సుప్రీంకోర్టు ఘాటుగా కామెంట్ చేసింది. ఒడిశాకు చెందిన వ్యక్తి డ్రగ్స్ కేసులో బెయిల్ విచారణ సందర్భంగా సుప్రీం న్యాయమూర్తులు జస్టిస్ రాజేశ్ బిందాల్, జస్టిస్ విక్రమ్ నాథ్ తో కూడిన ద్విసభ్య బెంచ్(Devision) ఈ మేరకు అభిప్రాయాన్ని కనబరిచారు. తన సహ నిందితుడికి ఒడిశా హైకోర్టులో బెయిల్ వచ్చిందని, తనకు రాలేదంటూ ప్రధాన నిందితుడు సుప్రీంలో పిటిషన్ వేశాడు. ఇక్కడ విచారణ జరుగుతుండగానే మళ్లీ ఒడిశా హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేశాడు. ఇంతలోనే హైకోర్టులో బెయిల్ మంజూరైనా ఆ విషయాన్ని సర్వోన్నత న్యాయస్థానానికి చెప్పకుండా దాచిపెట్టాడు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈ విషయాన్ని కోర్టుకు తెలియజేయడంతో.. న్యాయమూర్తులు ఈ విధమైన అభిప్రాయాల్ని పంచుకున్నారు.