రాహుల్ గాంధీకి విధించిన జైలు శిక్షపై సుప్రీంకోర్టు ‘స్టే’ విధించింది. రెండేళ్ల జైలు శిక్షపై ‘స్టే’ను విధిస్తూ ఆదేశాలు ఇవ్వడంతో కాంగ్రెస్ అగ్రనేతకు ఊరట లభించినట్లయింది. దిగువ కోర్టులు ఇచ్చిన తీర్పుల్లో ఇంకా స్పష్టత(Clarity) ఉండాల్సిన అవసరం ఉందని సుప్రీం భావించింది. గుజరాత్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వేసిన పిటిషన్ పై నేడు విచారణ జరిగింది. ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తులు మాట్లాడే మాటల్లో జాగ్రత్తలు పాటించాలని రాహుల్ తరఫు న్యాయవాదికి సుప్రీం సూచించింది.
శిక్ష విధింపులో సరైన కారణాన్ని ట్రయల్ కోర్టు చూపించి ఉండాల్సిందని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. పేపర్ల సంఖ్యను చూశాయే గానీ కేసులో సరైన కారణాలను కింది కోర్టులు చూపలేదని పేర్కొంది. హైకోర్టు తీర్పుతో రద్దయిన లోక్ సభ సభ్యత్వానికి తాజా ఆదేశాలతో రాహుల్ కు మళ్లీ మార్గం లభించినట్లయింది.
నరేంద్ర మోదీని ఇంటి పేరుతో విమర్శించడంపై గుజరాత్ BJP MLA పూర్ణేశ్ మోదీ.. సూరత్ సెషన్స్ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అనంతరం ఆయనకు బెయిల్ మంజూరు చేసి అప్పీల్ కోసం 30 రోజుల గడువు ఇచ్చింది. ఈ తీర్పుపై గుజరాత్ హైకోర్టుకు వెళ్లారు రాహుల్. పరువు నష్టం కేసులో తనకు విధించిన శిక్షను నిలిపివేయాలంటూ వేసిన పిటిషన్ ను గుజరాత్ హైకోర్టు కొట్టివేసింది. సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఈ కేసులో శిక్ష విధించడం కరెక్టేనని, దీన్ని నిలిపివేసేందుకు ఎలాంటి కారణాలు లేవంటూ హైకోర్టు పేర్కొంది. దీనిపై రాహుల్ సుప్రీం మెట్లు ఎక్కారు.