కుటుంబ విలువల(Family Values)పై చెప్పేదొకటి, చేసేదొకటంటూ సుప్రీంకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. విలువల గురించి మాట్లాడేవారు చాలా మంది ఉన్నారు.. కానీ పాటించేవారు లేరని అభిప్రాయపడింది. ముగ్గురు తనయులతో సత్సంబంధాలు లేని UP సుల్తాన్ పూర్ కు చెందిన వృద్ధురాలు..పెద్ద కుమారుడు తమ షాప్ తీసుకుని ఇంటిని అమ్మాలని చూస్తున్నాడని, అతణ్ని ఖాళీ చేయించాలంటూ వేసిన పిటిషన్ పై జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ ఎస్.వి.ఎన్.భట్ ధర్మాసనం పై విధంగా బాధను వ్యక్తపరిచింది.
న్యాయమూర్తులు ఏమన్నారంటే…
‘మనం వసుధైక కుటుంబాన్ని నమ్ముతాం.. అర్థమేంటంటే భూమి మొత్తం ఒకే కుటుంబమని.. కానీ ఆ తత్వం మరుగునపడింది.. కుటుంబాలే ఐక్యతగా ఉండటంలో దేశం ఇబ్బందులు పడుతోంది.. రక్త సంబంధీకులే ఒక్కటిగా ఉండలేకపోతున్నారు.. వసుధైక కుటుంబమనే భావనను ఇక ప్రపంచానికి ఏం చాటుతాం… ఇది ఒక వ్యక్తి, ఒక కుటుంబం భావనకు దారితీస్తోంది.. సంప్రదాయ విలువలు, మతపరమైన మద్దతు వంటివి ఆందోళనకరంగా మారుతున్నాయి..’ అంటూ భారతీయ సమాజానికి హెచ్చరికలు పంపింది.