ఉచిత పథకాలతో ప్రజలు పనిచేసేందుకు ఇష్టపడట్లేదని, ఇది దేశానికి నష్టమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. రాజకీయ పార్టీల(Political Parties) హామీలు ప్రమాదకరమని స్పష్టం చేసింది. ‘ఫ్రీ స్కీంల వల్ల పనికి ప్రజలు ఇష్టపడటం లేదు.. వారు ఉచితంగా రేషన్ పొందుతున్నారు.. ఎలాంటి పనిచేయకుండానే నగదు తీసుకుంటున్నారు..’ అని కోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. ‘ప్రజల్ని ఆదుకునే మీ నిర్ణయాల్ని అభినందిస్తున్నాం.. కానీ ఇది సమాజాని(Society)కి మంచిది కాదు.. దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మంచి నిర్ణయాలు ఉండాలి..’ అని సూచించింది. మహారాష్ట్రలో ‘లడ్కీ బెహన్’ పేరిట 2.5 లక్షల వార్షికాదాయం లోపు గల 21-65 ఏళ్ల మహిళలకు నెలకు రూ.1,500 ఇచ్చే పథకాన్ని గుర్తు చేసింది. ఇలా ఎన్నో స్కీములు మిగతా రాష్ట్రాల్లోనూ ఉన్నాయని తెలిపింది.
పట్టణాల్లోని నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలన్న పిటిషన్ పై జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్ ధర్మాసనం.. ఉచితాలను ప్రస్తావించింది. పట్టణ పేదరిక నిర్మూలన పథకం మిషన్ ద్వారా కేంద్రం చర్యలు తీసుకుంటోందని అటార్నీ జనరల్(AG) వెంకటరమణి.. కోర్టుకు తెలిపారు. మీరు చెప్పినట్లు ఎంతకాలం లోపు పని పూర్తి చేస్తారంటూ AGని ప్రశ్నిస్తూ కేసును 6 వారాల పాటు వాయిదా వేసింది. ఉచితాలపై సుప్రీం గతేడాది సైతం ఇలాగే స్పందించింది. ప్రచారాల్లో ఈ తరహా ప్రకటనలు నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్ పై కేంద్ర ప్రభుత్వంతోపాటు ఎన్నికల సంఘం అభిప్రాయం కోరింది.