వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో సైంటిఫిక్(Scientific) సర్వే ప్రారంభమైంది. ఈ సర్వే కోసం పోలీసు కమిషనర్ అశోక్ ముథా జైన్, జిల్లా జడ్జి ఎస్.రాజలింగం మసీదు వద్దకు చేరుకున్నారు. వీరిరువురి నేతృత్వంలో మొత్తం 41 మంది ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ASI)కు చెందిన అధికారులు సర్వేలో పాల్గొంటున్నారు. నిజానిజాలు నిర్ధారించేందుకు గాను జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వే చేసేందుకు అలహాబాద్ హైకోర్టు అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. ఆలయ పునాదులపై మసీదు నిర్మించారన్న వాదనలపై వాస్తవాలు గుర్తించేందుకు ఈ అనుమతి మంజూరు చేసింది. ASI సర్వేకు పర్మిషన్ ఇస్తూ సెషన్స్ కోర్టు ఇచ్చిన ఆర్డర్స్ ను అలహాబాద్ హైకోర్టు సమర్థించింది.
కాశీ విశ్వనాథ్ టెంపుల్ సమీపంలోని జ్ఞానవాపి మసీదులో సర్వేకు ASIకి ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ వేసిన పిటిషన్ ను హైకోర్టు రిజెక్ట్ చేసింది. జులై 21న వెలువడిన సెషన్స్ కోర్టు తీర్పును హైకోర్టు సపోర్ట్ చేసింది. మరోవైపు భారీ భద్రత నడుమ సర్వే కొనసాగుతున్నది. పొద్దున 7 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ సర్వే కొనసాగుతుంది. ఇంతెజామియా మసీదు కమిటీ ఈ సర్వేను బాయ్ కాట్ చేసింది. మరోవైపు హైకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ ను నిలిపివేసి సర్వేను ఆపాలంటూ మసీదు కమిటీ సుప్రీంకోర్టును కోరింది. CJI డి.వై.చంద్రచూడ్ ఈ పిటిషన్ ను స్వీకరించారు.