తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్.రవి, అక్కడి ప్రభుత్వం మధ్య మరోసారి అగ్గి రాజుకుంది. తన ప్రసంగానికి ముందు జాతీయ గీతం(National Anthem) ఆలపించలేదంటూ శాసనసభ నుంచి వాకౌట్ చేశారు. అసెంబ్లీ సమావేశాల తొలిరోజు గవర్నర్ ప్రసంగించడం సాధారణ ప్రక్రియే. ముందుగా రాష్ట్ర గీతమైన తమిళ్ తాయి వాల్తు, ముగింపుగా జాతీయ గీతం పాడటం ఆనవాయితీగా వస్తోంది. అయితే రెండు సందర్భాల్లోనూ జాతీయ గీతం ఉండాలని గవర్నర్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి స్టాలిన్ స్పీకర్ కు చెప్పినా యథావిధిగానే తమిళ గీతాన్ని ఆలపించారు. దీనిపై అసహనంతో రవి వాకౌట్ చేశారు.
జాతీయ గీతాన్ని ఆలపించడం ప్రాథమిక విధి అయినా తమిళనాడు దాన్ని పట్టించుకోవడం లేదని గవర్నర్ కార్యాలయం ఆరోపించింది. 2021లో గవర్నర్ గా బాధ్యతలు చేపట్టినప్పట్నుంచీ ప్రభుత్వానికి ఆయనకు రగడ జరుగుతూనే ఉంది. ఇప్పటికే పలు బిల్లుల్ని ఆయన అడ్డుకోగా, స్టాలిన్ సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గవర్నర్ తీరును తప్పుబట్టిన కోర్టు.. సర్కారుకు అనుకూలంగా తీర్పిచ్చింది. గతేడాది సైతం రవి ఇదే తీరులో అసెంబ్లీ నుంచి బయటకు(Walk Out) వెళ్లి పోయారు.