ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ED) తమిళనాడులో దూకుడు పెంచింది. మరో మంత్రిని అదుపులోకి తీసుకుని ఎంక్వయిరీ నిర్వహిస్తోంది. తమిళనాడు ఉన్నత విద్యాశాఖ మంత్రి, DMK సీనియర్ లీడర్ K.పొన్ముడిని ED అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం అక్కడి మెయిన్ ఆఫీసుకు తరలించింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కేంద్ర బలగాలతో అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విల్లుపురంలోని ఆయన నివాసంలో 10 గంటల పాటు సోదాలు చేపట్టిన ED అధికారుల బృందం.. ముఖ్యమైన పత్రాల కోసం పూర్తిస్థాయిలో సోదాలు కొనసాగించింది. అనంతరం మంత్రి పొన్ముడిని ED కార్యాలయానికి తరలించి దర్యాప్తు మొదలుపెట్టింది.
ఇసుక అక్రమ తవ్వకాలతో ముడిపడి ఉన్న మనీ లాండరింగ్ కేసులో పొన్ముడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఈయనతోపాటు ఆయన కుమారుడు గౌతం సింగమణికి సంబంధించిన ఆస్తులపై ED సోదాలు నిర్వహించింది. ED అదుపులోకి తీసుకోవడంతో అక్రమాల కేసులో నిందితుడిగా మారిన రెండో తమిళనాడు మంత్రిగా పొన్ముడి నిలిచిపోయారు. అంతకుముందు ఆవినీతి, అక్రమాల కేసులో మరో మంత్రి వి.సెంథిల్ బాలాజీ కూడా అరెస్టయ్యారు.