రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగింది. నవంబరు 30న పోలింగ్ జరగనుంది. ఇందుకు సంబంధించి షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) ప్రకటించింది. డిసెంబరు 3న కౌంటింగ్ జరగనుండగా… తెలంగాణ మొత్తం ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తారు. మొత్తం 5 రాష్ట్రాలు తెలంగాణ, మధ్యప్రదేశ్, మిజోరాం, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ కు ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ చేసింది. రాష్ట్రంలో ఎన్నికల కోసం 72,000 బ్యాలెట్ యూనిట్లు, 56,000 వీవీప్యాట్ లు అందుబాటులో ఉంచుతున్నారు. 27,798 పోలింగ్ సెంటర్లలో ఓటింగ్ నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 679 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతుండగా.. దేశంలో 1/6 వంతు సెగ్మెంట్లకు ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల్లో 1.77 లక్షల పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. 80 ఏళ్లు పైబడ్డ వారు 4.43 లక్షల మంది ఉండగా.. వీరంతా ఇంటి నుంచే ఓటు(Vote From Home) వేయవచ్చు.
నామినేషన్లు అప్పట్నుంచే
నవంబరు 3న… నోటిఫికేషన్
నవంబరు 10… నామినేషన్ల స్వీకరణకు తుది గడువు
నవంబరు 13… నామినేషన్ల పరిశీలన
నవంబరు 15 వరకు.. నామినేషన్ల ఉపసంహరణ
నవంబరు 30… పోలింగ్
డిసెంబరు 3… కౌంటింగ్
అమల్లోకి వచ్చిన ‘మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్’
ఎన్నికలు జరగనున్న 5 రాష్ట్రాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చింది. షెడ్యూల్ తోపాటే ‘మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్’ అమలులో ఉంటుందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ ఐదు రాష్ట్రాల్లో 17.14 కోట్ల మంది ఓటర్లు ఓటు వేయనుండగా.. ఓటు వినియోగించుకునే వారి సంఖ్య దేశంలో 1/6 వంతుగా ఉంది. మిజోరాం, ఛత్తీస్ గఢ్ లో మహిళా ఓటర్ల సంఖ్య పురుషుల కంటే ఎక్కువగా ఉంది. తెలంగాణలోనూ స్త్రీ, పురుష నిష్పత్తిలో పెద్దగా తేడా లేదు. స్త్రీ, పురుష నిష్పత్తి రాష్ట్రంలో 998:1000గా ఉంది.
మిగతా రాష్ట్రాల్లోనూ…
మిజోరాం
నవంబరు 7… పోలింగ్
డిసెంబరు 3… కౌంటింగ్
మధ్యప్రదేశ్
నవంబరు 17… పోలింగ్
డిసెంబరు 3… కౌంటింగ్
ఛత్తీస్ గఢ్(రెండు దశలు)
నవంబరు 7, 17… పోలింగ్
డిసెంబరు 3… కౌంటింగ్
రాజస్థాన్
నవంబరు 23… పోలింగ్
డిసెంబరు 3… కౌంటింగ్