జమ్మూకశ్మీర్ లో ఆర్మీ కాన్వాయ్(Convoy)పై ముష్కరులు(Terrorists) దాడికి పాల్పడటంతో ఐదుగురు జవాన్లు వీరమరణం పొందారు. మరో ఆరుగురు గాయాల పాలయ్యారు. ఆర్మీకి చెందిన ‘9 కార్ప్స్’కు సమీపంలో కథువా జిల్లాలోని మచేడి ప్రాంతంలో దుర్ఘటన జరిగింది.
ప్రతిగా జవాన్లు ఉగ్రవాదులపై కాల్పులకు దిగగా.. సమీప ప్రాంతాల్లో భారీయెత్తున వేట కొనసాగిస్తున్నారు. మచేడి-కిండ్లి-మల్హర్ ఏరియాలో సాయంత్రం నుంచి బలగాలు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాయి. కథువాకు 150 కిలోమీటర్ల దూరంలో దాడి జరగ్గా.. తొలుత గ్రనేడ్ విసిరిన దుండగులు తర్వాత కాల్పులకు దిగారు.
గత 48 గంటల వ్యవధిలో జరిగిన రెండో దాడి ఇది. రాజౌరిలోని ఆర్మీ క్యాంపుపై జరిగిన దాడిలో ఒక జవాను గాయపడ్డారు. కుల్గామ్ జిల్లాలో జరిగిన రెండు ఎన్కౌంటర్లలో ఆరుగురు ఉగ్రవాదులు హతమైన కొద్ది గంటల్లోనే ఈ సంఘటన చోటుచేసుకుంది.