రోజంతా కరెంటు లేకపోవడంతో ఏం జరిగిందబ్బా అని చూస్తే అసలక్కడ ట్రాన్స్ ఫార్మరే కనపడలేదు. అలా 20 రోజులుగా గ్రామమంతా చీకట్లో ఉండిపోగా, చలికి అవస్థలు పడుతూనే ప్రజలంతా కాలం గడుపుతున్నారు. ఉత్తరప్రదేశ్ లోని బదౌన్(Badaun) జిల్లా సోరహ(Soraha) గ్రామంలో ఈ ఘటన జరిగింది. ట్రాన్స్ ఫార్మర్, రాగి వైర్లు, ఆయిల్ సహా మొత్తం వస్తువుల్ని ఎత్తుకెళ్లినట్లు డిసెంబరు 15న గుర్తించిన గ్రామస్థులు.. సమీపంలోని ఉఘాయితి పోలీస్ స్టేషన్లో కంప్లయింట్ ఇచ్చారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతున్నా 20 రోజుల నుంచి కొత్త ట్రాన్స్ ఫార్మర్ మాత్రం ఇవ్వలేదని సోరహ వాసులంటున్నారు. అసలే UP బోర్డు ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు, పొలాలకు కరెంటివ్వలేక రైతుల ఇబ్బందులు చెప్పరానివి.
కనీసం ఇన్వర్టర్లు, మొబైల్ ఫోన్లనూ ఛార్జింగ్ చేసుకునే అవకాశం లేకుండా పోయింది. విద్యుత్తు శాఖకు ఎన్నిసార్లు దరఖాస్తులు ఇచ్చినా లాభం లేదని గ్రామస్థులు చెబుతుంటే.. పక్క ఊరి నుంచి కరెంటు సప్లయ్ చేస్తున్నామని అధికారులు అంటున్నారు. స్థానికులు ఇదంతా అబద్ధమంటుండగా.. ఇక CC కెమెరాల ఆధారంగా దొంగల్ని గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. చలికాలంలో ట్రాన్స్ ఫార్మర్లు ఎత్తుకెళ్లడం UPలో కామన్ అయితే.. ఇందుకోసమే పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు.