కోట్లల్లో ఆస్తులు.. జిల్లా బాస్ లాంటి పోస్ట్.. బాగా చదువుకున్న కుటుంబం.. ఇలా ఎన్ని ఉన్నా కనీస విచక్షణ మరిస్తే ఏమవుతుందో ఆ IAS కుటుంబాన్ని చూస్తే తెలుస్తుంది. మహారాష్ట్ర కేడర్లో ట్రెయినీ IASగా రిక్రూటయిన 2023 బ్యాచ్ కు చెందిన 841వ ర్యాంకర్ పూజ ఖేడ్కర్ దే ఈ కథ.
ట్రెయినీ అయినా తన ఆడీ(Audi) కారుకు సింబాలిక్ లైట్లు(Beacon), క్వార్టర్స్ కావాలంటూ డిమాండ్లు చేసి చిక్కులు తెచ్చుకున్నారీమె. జాయింట్ కలెక్టర్(JC) లేని టైంలో ఛాంబర్ కు తన నేమ్ ప్లేట్ పెట్టుకోవడంతో పుణె కలెక్టర్ కు చిర్రెత్తుకొచ్చి కంప్లయింట్ చేశారు. దీంతో ఆమెను పుణె నుంచి వాశిమ్ జిల్లాకు పంపించారు.
పూజ వ్యవహారాన్ని లోతుగా తవ్వితే… సివిల్స్ పరీక్షల్లో పాసవడానికి దివ్యాంగురాలి(Disability) సర్టిఫికెట్ ఇవ్వడం, తన పేరున రూ.25 కోట్ల ఆసులున్నా పేదరాలి కోటాను వాడుకున్నట్లు ఆరోపణలు రావడంతో కేంద్రం ఏకసభ్య కమిషన్ వేసింది. పూజ తండ్రి ఉన్నతాధికారిగా ఉన్నప్పుడు 25 ఎకరాల భూమి కొన్నారు. దాని చుట్టూ ఉన్న స్థలాల్ని కలిపి ఫెన్సింగ్ వేస్తే అడ్డొచ్చిన రైతులపై పిస్టోలు గురిపెట్టి బెదిరించారు ఆమె తల్లి మనోరమ.
ఈ వీడియోలు వైరలై అరెస్టు చేస్తారన్న భయంతో వారు అదృశ్యమయ్యారు. ఆమె ఇల్లు చుట్టూ అక్రమ నిర్మాణాలటూ చివరకు వాటిని పుణె మున్సిపాల్టీ కూల్చేసింది. తండ్రి జాడ లేకపోగా, తల్లి మనోరమను ఎట్టకేలకు అరెస్టు చేశారు. పూజను తిరిగి ముస్సోరీ అకాడెమీకి ఈ నెల 23లోపు తిరిగి రావాలని కేంద్రం ఆదేశించింది. ఇలా అత్యుత్సాహం, అధికారం ఉంది కదా అని ఇష్టమొచ్చినట్లు చేస్తే ఆ కుటుంబమే ఛిన్నాభిన్నమైంది.