తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచి భారత్ రాష్ట్ర సమితి(BRS) ప్రభుత్వ పదేళ్ల పాలనా కాలంలో పరిపాలన వ్యవహారాల్ని TSగా అమలు చేస్తే.. ఇప్పుడు దాని రూపం మార్చుతూ కొత్త సర్కారు నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన ‘TG’కి కేంద్రం ఆమోదం తెలిపింది. దీంతో ఇకనుంచి మోటార్ వాహనాలపై TSకు బదులు TGగా దర్శనమివ్వాల్సి ఉంటుంది.
యాక్ట్ ప్రకారం…
1988 మోటార్ వాహనాల చట్టం సెక్షన్ 41 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు ఆమోదం తెలుపుతున్నట్లు కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల శాఖ గెజిట్ విడుదల చేసింది. ఇది ఈనెల 12 నుంచి తక్షణమే అమలులోకి వస్తుందని అందులో తెలియజేసింది. దీంతో ఇక తెలంగాణకు చెందిన వాహనాలన్నింటికీ(Vehicles) TGతోనే రిజిస్ట్రేషన్లు చేయాల్సి ఉంటుంది.
TRS నుంచే TSగా…
గతంలో ఉన్న TRS అక్షరాలను ఆధారంగా చేసుకుని TSను వాడుకలోకి తెచ్చారంటూ ముఖ్యమంత్రి రేవంత్ గతంలో ప్రతిపక్ష నేతగా ఆరోపించారు. రేవంత్ కు తోడు కాంగ్రెస్ పార్టీ సైతం TGనే సమర్థిస్తూ అప్పటి అధికార పార్టీ తీరును విమర్శించింది. తాము అధికారంలోకి వస్తే TGగా మార్పు చేస్తామని ప్రకటించిన మేరకు అందుకు సంబంధించి సవరణ చేస్తూ కేంద్రానికి నోట్ ఫైల్ పంపింది. రాష్ట్ర ప్రభుత్వ వినతిని పరిశీలించిన మోదీ సర్కారు.. TGకి ఆమోదం తెలుపుతూ గెజిట్ విడుదల చేసింది.