ఉద్యోగుల కోసం యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్(UPS)ను కేంద్రం ప్రవేశపెట్టింది. కేబినెట్ భేటీలో తీసుకున్న 3 స్కీంలు.. బయో E-3, విజ్ఞాన్ ధార, UPS వివరాల్ని మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. UPS ద్వారా 23 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మేలు కలగనుంది. దీనిపై ఆప్షన్(Option) ఇచ్చుకునే వెసులుబాటును రాష్ట్రాలకూ కల్పించింది.
ఎరియర్స్(Arrears) ద్వారా రూ.800 కోట్లు చెల్లించాల్సి రానుండగా, సంవత్సరానికి రూ.6,250 కోట్ల భారం పడనుంది. ఈ స్కీమ్ 2025 ఏప్రిల్ 1 వర్తించనుండగా.. నేషనల్ పెన్షన్ స్కీమ్(NPS), యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కు సంబంధించి ఆప్షన్లు ఇచ్చుకునే అవకాశం ఉద్యోగులకే కట్టబెట్టింది.
కీలకాంశాలవే…
* కనీసం 25 ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన ఉద్యోగులకు పదవీ విరమణకు ముందు గత 12 నెలల సగటు మూల వేతనంలో 50% పెన్షన్ గా ఈ స్కీమ్ వర్తించనుంది.
* మిగిలినవారికి సర్వీసును బట్టి పెన్షన్ ఉంటుంది.
* రాష్ట్ర ప్రభుత్వాలు ఇందులో చేరాలనుకుంటే లబ్ధిదారుల సంఖ్య 23 లక్షల నుంచి 90 లక్షలకు చేరుతుంది.
* ఉద్యోగులు 10 శాతం కంట్రిబ్యూట్ చేస్తుంటే ఇప్పటివరకు కేంద్రం 14 శాతం వాటాను అందించింది. కానీ కొత్త విధానంలో 14% నుంచి 18%నికి పెరుగుతుంది.
* OPS కింద రిటైర్ అయిన ఉద్యోగులు వారి చివరి జీతంలో 50 శాతాన్ని నెలవారీ పింఛనుగా పొందారు. DA రేట్ల పెంపుతో ఆ మొత్తం కూడా పెరుగుతూనే ఉంటుంది.
* కనీస పెన్షన్ రావాలంటే పదేళ్ల సర్వీస్ పూర్తి చేసుకోవాల్సి ఉండగా.. పదేళ్ల తర్వాత పదవీ విరమణ చేసిన వారికి పింఛను రూ.10,000 లభిస్తుంది.
* సర్వీసులో ఉద్యోగి మరణిస్తే ఆయన సతీమణికి 60 శాతం పెన్షన్ అందుతుంది.
* 2004 ఏప్రిల్ 1 తర్వాత NPS వర్తిస్తున్న ఉద్యోగులంతా ఇప్పుడు UPS పరిధిలోని రానున్నారు.