ఉత్తరప్రదేశ్ లోని సంభాల్(Sambhal)లో జరిగిన అల్లర్లపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అనుమానాలు వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ ఘర్షణలకు సంభాల్ అల్లర్లకు సంబంధం ఉందంటూ సంచలన ప్రకటన చేశారు. అయోధ్యలో నిర్వహించిన రామాయణ్ మేళాలో పాల్గొన్న యోగి.. ‘కావాలనే విధ్వంసం సృష్టించేలా భద్రతా దళాలపై తిరగబడ్డ తీరు చూస్తే… ‘బంగ్లాదేశ్-యూపీ సంభాల్ అల్లర్లకు పోలిక ఉంది.. 500 ఏళ్ల క్రితం అయోధ్య కుంభ్ లో బాబర్ సేన ఏం చేసిందో ఇప్పుడూ అలాగే జరిగింది.. ఈ మూడింటి DNA అలాగే ఉంది.. యూపీలో సంక్షోభం తేవడం ద్వారా స్వేచ్ఛ లేదని ప్రచారం చేసి మనల్ని ఇరుకున పెట్టాలన్నదే అసలు లక్ష్యం.. అయోధ్యలో రామ మందిర పునర్నిర్మాణాన్ని ఓర్వలేక కూడా ఇదంతా చేస్తున్నట్లనిపిస్తుంది..’ అని యోగి అన్నారు.
బాబర్ కాలం నాటి షాహీ జామా మసీదు కింద హరిహర ఆలయం ఉందని, దీనిపై పురావస్తు శాఖ సర్వే నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్ పై సంభాల్ కోర్టు.. ఈ నవంబరు 19న సర్వేకు ఆదేశించింది. అదే నెల 24న సర్వే కోసం అధికారులు వస్తున్న సమయంలో దాడులు మొదలై కాల్పులకు దారితీసి నలుగురు ప్రాణాలు కోల్పోయారు.