Published 06 Dec 2023
ఢిల్లీలో పర్యటన ముగించుకుని తిరుగు ముఖం పట్టాల్సిన తరుణంలో.. తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వింత అనుభవం ఎదురైంది. ఇక కొద్దిసేపట్లో ఢిల్లీ ఎయిర్ పోర్టులో విమానం ఎక్కుదామనుకునే లోపే దాన్ని వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. వెంటనే విమానాశ్రయం నుంచి మళ్లీ హస్తినలోకి అడుగుపెట్టాల్సి వచ్చింది. సీఎంగా అభ్యర్థిత్వ ప్రకటన అనంతరం నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్న రేవంత్.. ఈ రోజు పొద్దున్నుంచి బిజిబిజీగా గడిపారు. కేసీ వేణుగోపాల్ తో స్టార్ట్ చేసి మల్లికార్జున ఖర్గే, రాహుల్, సోనియా గాంధీ, ప్రియాంకతోపాటు పార్టీ అగ్రశ్రేణి నేతలందర్నీ కలిశారు. రేపటి ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా AICC లీడర్లందరినీ ఆహ్వానించారు. ఇక గురువారం నాటి ప్రమాణస్వీకారానికి గాను హైదరాబాద్ బయల్దేరేందుకు బుధవారం మధ్యాహ్నం 4 గంటలకు ఆయన ఢిల్లీ విమానాశ్రయం చేరుకున్నారు.
కాల్ ఎవరిదో తెలియదు కానీ…
ఇక కొద్దిసేపట్లో ఫ్లైట్ ఎక్కబోతున్నారనగానే రేవంత్ కు ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ లో మాట్లాడిన వెంటనే ఆయన ఎయిర్ పోర్టు నుంచి వెనక్కు మళ్లారు. నేరుగా అక్కణ్నుంచి మహారాష్ట్ర సదన్ కు వెళ్లిపోయారు. అత్యవసరంగా వచ్చిన ఆ కాల్ ఎవరిది.. కాబోయే CM ఎయిర్ పోర్ట్ నుంచి ఆగమేఘాల మీద తిరిగి వెళ్లాల్సినంత అత్యవసర పరిస్థితి ఏమొచ్చిందన్నది అక్కడున్నవారికి అర్థం కాలేదు.