మొఘలుల కాలం నాటి మసీదులో సర్వే నిర్వహించాలంటూ కోర్టు ఉత్తర్వులివ్వడం(Orders)తో అల్లర్లు చెలరేగి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పరిస్థితి చేజారిపోవడంతో ఇంటర్నెట్ నిలిపివేసిన ఘటన ఉత్తరప్రదేశ్(UP)లోని సంభాల్ లో జరిగింది. పురాతన షాహీ జామా మసీదులో సర్వే చేయాలంటూ నిన్న(ఆదివారం) ఉదయం లోకల్ కోర్టు ఆదేశాలిచ్చింది. హరిహర ఆలయంపై మసీదు నిర్మించారని వేసిన పిటిషన్ పై ఆదేశాలివ్వడంతో.. స్థానికులు ఆందోళనకు దిగారు. పోలీసులపైకి రాళ్లు విసరడంతోపాటు వాహనాలకు నిప్పు పెట్టి గందరగోళం సృష్టించారు.
అప్పటికే 20 మంది పోలీసులకు గాయాలు కాగా.. ఆందోళనకారుల్ని చెదరగొట్టేందుకు బాష్పవాయు గోళాల్ని(Tear Gas) ప్రయోగించారు. ఇద్దరు మహిళలు సహా 21 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు హాలిడే ప్రకటించిన అధికారులు సంభాల్ లో ఇంటర్నెట్ బ్యాన్ చేశారు. 1529లో బాబర్ కాలంలో ఆలయంపై మసీదు కట్టారనేది ఆరోపణ. ఈ ఘర్షణలపై సంభాల్ MP, సమాజ్ వాదీ పార్టీ లీడర్ జియావుర్ రెహ్మాన్ బర్ఖ్, సోహైల్ ఇక్బాల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.