జమిలి ఎన్నికల బిల్లును కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు పార్లమెంటు(Parliament) ముందుకు తీసుకువచ్చింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ ఈ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టగా ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఓటింగ్ నిర్వహించారు. కొంతమందికి ఎలక్ట్రానిక్ పద్ధతిలో సమస్య ఏర్పడటంతో అలాంటి వారికి బ్యాలెట్ స్లిప్పులు ఇచ్చి ఓటు వేయించారు. అనుకూలంగా 269 మంది, వ్యతిరేకంగా 198 మంది MPలు ఓటు వేశారు. లోక్ సభలో మొత్తం 543 మంది సభ్యులుండగా.. కొత్త పార్లమెంటు భవనంలో తొలిసారి హైబ్రిడ్ విధానంలో ఓటింగ్ నిర్వహించారు. మెజార్టీ ఓట్లు లభించడంతో ఇక జమిలి ఎన్నికల బిల్లును రెండు సభల్లో ప్రవేశపెడతారు. అయితే ముందుగా జాయింట్ పార్లమెంటరీ కమిటీ(JPC) వేసే యోచనలో కేంద్రం ఉంది. బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే విషయంలో ఈ ఓటింగ్ తో కేంద్ర ప్రభుత్వం సక్సెస్ అయినట్లయింది.