దేశ భద్రత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉదాసీనంగా వ్యవహరించకూడదన్న రీతిలో కేంద్ర బలగాలకు ప్రభుత్వం గట్టి వార్నింగ్ ఇచ్చింది. సోషల్ మీడియా పోస్టులకు దూరంగా ఉండాలంటూ భద్రతా బలగాల(Security Forces)ను కేంద్రం ఆదేశించింది. ఆన్లైన్ ఫ్రెండ్ షిప్ వైపు వెళ్లడం, సోషల్ మీడియాలో రీల్స్ పెట్టడం ఇక నుంచి కుదరదని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఇష్టారీతిన వాడుతున్న సోషల్ మీడియా వల్ల సున్నిత, రహస్యమైన ఇన్ఫర్మేషన్ శత్రువులకు చేరుతోందని తెలిపింది. తాము యూనిఫాంలో ఉండగానే కొంతమంది ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తున్నారని సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలు గుర్తించి కేంద్రానికి రిపోర్ట్ అందజేశాయి.
సున్నితమైన(Sensitive) ఏరియాల్లో ఫొటోలు దిగి షేర్ చేయడం, ఆన్ లైన్ లో ఫ్రెండ్స్ రిక్వెస్ట్ పంపడం, యాక్సెప్ట్ చేయడం వంటివన్నీ చేయకూడదంటూ కేంద్ర పారామిలిటరీతోపాటు పోలీసు బలగాలకు కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరోలు ప్రభుత్వ ఆదేశాల మేరకు లెటర్లు పంపించాయి. ఈ గైడ్ లైన్స్ ను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించాయి.