Published 01 Dec 2023
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు సంయమనం పాటించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. నాగార్జునసాగర్ నీటి విడుదల(Water Release) విషయంలో తలెత్తిన వివాదంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రెండు తెలుగు రాష్ట్రాలకు వార్నింగ్ ఇచ్చింది. ఇరు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీ(CS)లు, DGPలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా.. సాగర్ డ్యాంపై యథాతథస్థితిని కొనసాగించాలని ఆదేశించారు. ఉభయ రాష్ట్రాల పోలీసుల మధ్య గొడవ జరిగిన దృష్ట్యా.. తాత్కాలికంగా డ్యామ్ CRPF పర్యవేక్షణలో ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శితోపాటు సెంట్రల్ వాటర్ కమిషన్(CWC), KRMB(Krishna River Management Board) అధికారులు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.
నీటి విడుదల ఆపాలన్న బోర్డు
కుడి కాల్వ నుంచి నీటి విడుదలను ఆపాలని APకి కృష్ణా బోర్డు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై AP జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శికి KRMB సభ్య కార్యదర్శి లేఖ రాశారు. జగన్ సర్కారుపై తెలంగాణ ఫిర్యాదు చేయడంతో స్పందించిన బోర్డు.. నవంబరు 29న అర్ధరాత్రి సాగర్ డ్యామ్ ను AP ఆక్రమించిందని, బలవంతంగా నీరు రిలీజ్ చేసినట్లు నిర్ధారించింది. 2023 అక్టోబరు 10 నుంచి 2024 ఏప్రిల్ 18 వరకు 15 TMCలు ఇవ్వాలని AP కోరిందని, 5 TMCల చొప్పున 3 ఫేజ్ లుగా నీరివ్వాలని అడిగిందని బోర్డు తెలిపింది. ఫస్ట్ ఫేజ్ లో అక్టోబరు 10 నుంచి 20 వరకు 5 TMCలు వాడుకోగా, రెండో విడతను వచ్చే జనవరిలో, ఇక థర్డ్ ఫేజ్ ను ఏప్రిల్ లో రిలీజ్ చేయాల్సి ఉందని స్పష్టం చేసింది. జనవరిలోనే నీటి విడుదల ఉండగా.. ఈలోపే జగన్ సర్కారు నీటి దోపిడీకి పాల్పడిందంటూ కృష్ణా బోర్డు జలవనరుల శాఖకు కంప్లయింట్ చేసింది. దీంతో రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులతో కేంద్ర హోంశాఖ వీడియో కాన్ఫరెన్స్ చేపట్టింది.