
గత కొద్దిరోజులను పరిశీలిస్తే ఇది వానాకాలమేనా అన్న సందేహం కలుగుతోంది. వర్షాలు లేక దేశవ్యాప్తంగా దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడ్డాయి. దేశంలో 31 శాతం ప్రాంతాలు కరవులో చిక్కుకున్నాయని స్టాండర్డైజ్ ప్రెసిపిటేషన్ ఇండెక్స్ SPI తెలిపింది. కంటిన్యూగా మూడు వారాల పాటు వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని రిపోర్ట్ లో వెల్లడించింది. జులై 27 నుంచి ఆగస్టు 23 మధ్య సాగు తీరు, పంటల విస్తీర్ణం, భూముల్లో తేమ శాతాన్ని పరిగణలోకి తీసుకుని ఈ అంచనాకు వచ్చింది. అయితే దీన్ని ‘కరవు’ పదానికి బదులుగా ‘వర్షపాత లోటు’గా చూడాలని భారత వాతావరణ శాఖ సూచించింది. ప్రపంచ వాతావరణ సంస్థ(WMI) ప్రమాణాల మేరకు దేశంలోని వివిధ కాలమానాలను పరిశీలించి SPI ఈ రిపోర్టును తయారు చేసింది. దేశవ్యాప్తంగా 31 శాతం ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడగా.. అందులో 9 శాతం పూర్తిగా వానలే లేవని తెలిపింది. మరో 4 శాతం ఏరియాల్లో దుర్భిక్ష పరిస్థితులు కనిపించాయని, మొత్తంగా 13 శాతం ప్రాంతాల్లో వర్షాల తీరు దయనీయంగా ఉందని వెల్లడించింది.
ఇప్పటికే పరిస్థితులు ఇలా ఉంటే ఇక వచ్చే రెండు వారాలూ మరింత గడ్డు కాలమేనని, దేశ తూర్పు ప్రాంత రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర, గుజరాత్ ల్లోని దక్షిణ ప్రాంత జిల్లాల్లో వర్ష లోటు స్పష్టంగా కనిపించిందని తెలిపింది. వానలు లేకపోవడంతో ఆయా ప్రాంతాల్లో కఠిన పరిస్థితులు కనిపించాయని, భూముల్లో తేమ శాతం బాగా తగ్గి పంటల సాగుపై తీవ్ర ప్రభావం చూపిందని తెలిపింది. వివిధ సెక్టార్లలో ఏర్పడ్డ వర్షపాత లోటును తీవ్రమైన విషయంగా చూడాలని IMD సైంటిస్ట్ రాజీవ్ ఛటోపాధ్యాయ అంటున్నారు. ఇదే రకమైన వాతావరణం మరో 15 రోజుల పాటు ఉంటుందని రిపోర్ట్ లో వెల్లడించింది. వర్షాకాల సీజన్ మొదలయ్యే టైమ్ జూన్ 1 నుంచి ఆగస్టు 23 వరకు సైతం దేశంలోని వివిధ జిల్లాల్లో వెదర్ కండీషన్స్ ని SPI పరిశీలించింది.
నేలలు ఎర్రబారిన తీరు చూసి 2002లో ఏర్పడ్డ కరవు పరిస్థితులతో ప్రస్తుత లోటు వర్షపాతాన్ని పోల్చింది. నీటి కొరత చాలా పంటలపై ప్రభావం చూపిందని, రైతులు పెద్దయెత్తున నష్టపోవాల్సి వచ్చిందని రాజీవ్ ఛటోపాధ్యాయ వివరించారు. ఆగస్టులో ‘ఎల్ నినో’ లాంటి పరిస్థితులు ఏర్పడ్డా, సెప్టెంబరులో వానలు పడితే మాత్రం ఆ లోటు పూడ్చుకోవచ్చని వెదర్ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. ఒకవైపు ఉత్తర భారతంలో వర్షాలు బెంబేలెత్తిస్తుంటే మరోవైపు దేశంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయని SPI ప్రకటించడం ఆందోళనకర పరిస్థితులను కళ్లకు కడుతోంది.
Super