పదహారేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు. ఆర్థిక రాజధాని ముంబయిపై ఉగ్రవాదుల(Terrorists) దాడితో దేశమంతా అల్లకల్లోలం చెలరేగింది. ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్(CSMT)లో విచక్షణారహితంగా గన్ ఫైరింగ్ చేసి ఎంతోమందిని పొట్టనబెట్టుకున్నారు. పాకిస్థాన్ నుంచి సముద్ర మార్గాన తీరం చేరుకున్న టెర్రరిస్టులు.. 166 మందిని పొట్టన పెట్టుకున్నారు. నవంబరు 26న మొదలై 29 వరకు CSMT, ఒబెరాయ్ ట్రైడెంట్, తాజ్ మహల్ ప్యాలెస్, లియోపోల్డ్ కేఫ్, కేమా హాస్పిటల్, నారీమన్ హౌజ్ వద్ద దాడులు, కాల్పులు జరిగాయి. ఆ టైంలో అజ్మల్ కసబ్ ను ఓ చిన్నారి గుర్తు పట్టి చివరకు ఆమెనే సాక్షిగా మారి దోషికి మరణశిక్ష పడేలా చేసింది.
అంతటి సాహసానికి దిగిన ఆమె పేరు దేవికా రోటవాన్(Devika Rotawan). ఆనాటి కాల్పుల్లో కాలిలోకి బుల్లెట్ దూసుకుపోయిందీమెకు. ఆ గాయం ఇప్పటికీ వేధిస్తుండగా.. చలికాలం సీజన్లో ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 2008 నవంబరు 26న జరిగిన దాడుల్ని 26/11గా పిలుస్తుండగా, నాటి రాత్రి జరిగిన భయానక దృశ్యాల్ని తన 25వ ఏట దేవిక గుర్తు చేసుకున్నారు. ‘అక్కను చూసేందుకు పుణె వెళ్లడానికి నాన్నతో బాంద్రాలోని CSMT రైల్వే స్టేషన్ చేరుకున్నా.. కొద్దిసేపటికే బాంబు పేలితే మరోవైపు నుంచి కాల్పులు జరిపారు.. ఎంతోమంది గాయాలై అలాగే పడిపోయారు.. అందర్నీ సెయింట్ జార్జ్ హాస్పిటల్ తరలిస్తే కాలిలో బుల్లెట్ తొలగించేందుకు నన్ను JJ ఆస్పత్రికి తీసుకెళ్లారు.. ఆ తర్వాత నేను రాజస్థాన్ చేరుకున్నా.. నేను, నాన్న ఇద్దరం కసబ్ ను చూశాం.. అతడు కసబేనని ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు నేనే చెప్పా.. అతడు సృష్టించిన విధ్వంసాన్ని ఇప్పటికీ మరచిపోలేకపోతున్నా..’ అని గుర్తు చేసుకున్నారు.
ఇంకా ఏమన్నారంటే… ‘కసబ్ ను అక్కణ్నే చంపాలనిపించింది కానీ నేను చిన్నపిల్లని.. ఆనాడు అది జరగకున్నా కోర్టులో నిజం చెప్పి శిక్ష పడేలా చేయగలిగా.. నా కాలు నుంచి ఇప్పటికీ స్వెల్లింగ్ వస్తుంటుంది.. కసబ్ ను గుర్తుపట్టి కోర్టులో సాక్ష్యమివ్వడం గర్వంగా ఉంది.. అప్పటి బాధితుల కోసం ప్రజలు ముందుకు రావాలి..’ అని ఆనాటి జ్ఞాపకాల్ని వివరించారు. దేవికకు ఇల్లు కేటాయించాలని బాంబే హైకోర్టు ఆదేశాలివ్వగా, దాడుల పరిహారం కింద రూ.3.26 లక్షలు అందాయి. ట్రీట్మెంట్ కోసం దేవేంద్ర ఫడ్నవీస్ రూ.10 లక్షలు అందజేశారు.