పార్టీల తీరు ప్రస్తుతం.. నొసటితో చిట్లించి నోటితో నవ్వినట్లుగా తయారైంది పరిస్థితి. మహిళా రిజర్వేషన్ బిల్లు అమలులోకి తేవడం ద్వారా వారికి పెద్దపీట వేస్తూ.. ప్రతి పార్టీ 33% సీట్లను తప్పక కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇది ఇప్పుడే ఉంటుందా.. 2029 ఎన్నికల వరకు వెళ్తుందా అన్నది సందిగ్ధంగా మారింది. దేశ రాజకీయ వ్యవస్థలో పురుషాధిక్యం అంతకంతకూ తగ్గబోతున్న తీరుతో బడా లీడర్లుగా చెలామణి అవుతున్న చాలా మంది సీట్లు గల్లంతేనని చెప్పకతప్పదు. ఆ.. ఏముంది.. వారి సతీమణులనే రంగంలోకి దింపుతారు కదా అనుకోవచ్చు. అలా చేసినా నేరుగా అధికార పీఠం ఎక్కే అవకాశమైతే ఈ బడా లీడర్లకు ఉండదు. బిల్లు వస్తుందని తెలుసు కానీ ఇంత త్వరగా దీన్ని పట్టాలకెక్కిస్తారని ఎవరూ ఊహించి ఉండరు. ఎవరూ ఊహించంది చేయడమే అలవాటుగా చేసుకున్న మోదీ.. ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ వంటి అనూహ్య నిర్ణయాలతో అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఇప్పుడు మరోసారి అలాంటి నిర్ణయంతోనే దేశంలోని పార్టీలన్నింటినీ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. మరోవైపు లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టారు.
అసలే ఎన్నికల కాలం.. పార్టీలు పోటాపోటీగా అభ్యర్థుల(Candidates) వేటలో పడ్డాయి. ఒక పార్టీ ఇప్పటికే క్యాండిడేట్లను ప్రకటించి అందరికన్నా ముందు వరుసలో ఉంటే ఇంకో పార్టీ రేపో మాపో లిస్టు ప్రకటించేది. ఇక మరో పార్టీ కూడా అదే బాటలో వెళ్తున్నది. తాజా బిల్లుతో రాష్ట్రంలోని 119 సీట్లలో 40 స్థానాల్ని మహిళామణులకు ఇవ్వాల్సిందే. ప్రస్తుత తెలంగాణ అసెంబ్లీలో ఆరుగురు మహిళా ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. వారిలో ఖానాపూర్-రేఖానాయక్, మెదక్-పద్మా దేవేందర్ రెడ్డి, మహేశ్వరం-సబిత, ములుగు-అనసూయ(సీతక్క), ఇల్లెందు-హరిప్రియ, ఆలేరు-సునీత ఉన్నారు. ఈ లెక్కన అసెంబ్లీలో ఉమెన్ పర్సంటేజ్ కేవలం 5% మాత్రమే. అయితే ఈ కేటాయింపు ఎలా ఉంటుందన్నది ఇంకా తేలలేదు. జిల్లాను యూనిట్ గా తీసుకుంటే కష్టమే. ఎందుకంటే హైదరాబాద్ జిల్లాలో 15 సెగ్మెంట్లు ఉంటే.. కొన్ని చిన్న జిల్లాల్లో ఒకటే నియోజకవర్గం ఉంది. కాబట్టి ఏడు అసెంబ్లీ సీట్లుండే లోక్ సభ స్థానాన్ని యూనిట్ గా తీసుకోవాలన్న ఆలోచన ఉంది.
మరోవైపు SC, ST స్థానాల్లోనూ 33% రిజర్వేషన్లు ఇవ్వాల్సి ఉండగా.. 19 SC స్థానాల్లో 6 సీట్లు.. 12 ST ప్లేసుల్లో 4 సీట్లు ఇక నుంచి మహిళలవే. రాష్ట్రంలోని మొత్తం నియోజకవర్గాల్లో మహిళల సంఖ్యను పరిశీలిస్తే.. 53 శాతం వారిదే డామినేషన్. 64 సెగ్మెంట్లలో మహిళలదే హవా. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 10 నియోజకవర్గాల్లో మహిళలే ఎక్కువగా ఉన్నారు. మహిళల సంఖ్య ఎక్కువ గల సెగ్మెంట్లను రిజర్వేషన్ కు ప్రాతిపదికగా తీసుకుంటే మాత్రం.. ప్రతి పార్టీలోని ముఖ్యమైన, ప్రధాన నేతలంతా వేరే సెగ్మెంట్ చూసుకోవాల్సిందే. ఒకవేళ అసెంబ్లీ సీట్లు పెరిగిన తర్వాతే రిజర్వేషన్ అమలయితే ఆయా నేతలు ఊపిరి పీల్చుకుంటారు. బిల్లు పాసయినా ఇపుడున్న సీట్లతోనే ఎన్నికలకు వెళ్తారా లేదంటే పునర్విభజన(Delimitation) తర్వాత ఉంటుందా అన్నది తేలాల్సి ఉంది. దీనిపై డీలిమిటేషన్ కు వెళ్తే మాత్రం రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. ఇందుకూ కమలం పార్టీ సై అంది. బిల్లు కోసం 128వ రాజ్యాంగ సవరణ చేయాలని నిర్ణయించింది. మొత్తంగా BJP సర్కారు మాత్రం మహిళా రిజర్వేషన్ బిల్లును పాస్ చేయించే పట్టుదలతో ఉన్నట్లు కనపడుతున్నది.
Nice information