అవినీతి వ్యతిరేక ఉద్యమంతో రాజకీయ చరిత్ర(Political Entry) మొదలుపెట్టిన అరవింద్ కేజ్రీవాల్.. చివరకు అదే అవినీతిలో ఇరుక్కుపోయారు. ఆ ఫలితమే ప్రస్తుతం కమలానికి అధికార పీఠం కట్టబెట్టింది. BJPకి 48 సీట్లు రాబోతుంటే, అందులో సగం కూడా తెచ్చుకోలేకపోయింది ఆమ్ ఆద్మీ పార్టీ(AAP). కేవలం ఒక్కటి అనే కాకుండా చాలా వ్యవహారాల్లో పరువును పోగొట్టుకుంది. BJP-AAP సమానమన్న స్థాయి నుంచి అధఃపాతాళానికి పడిపోయింది కేజ్రీవాల్ పార్టీ. అవినీతి మరకలంటిన కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, సత్యేంద్రజైన్ వంటి నేతలంతా పరాజయం పాలయ్యారు. అన్నాహజారే హెచ్చరించినా తీరు మార్చుకోలేదు కేజ్రీవాల్.
AAP ఓటమికి అసలు కారణాలివే…
* ఢిల్లీ లిక్కర్ స్కాం దేశాన్నే కాకుండా ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది. కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, సత్యేంద్రజైన్, కల్వకుంట్ల కవిత వంటి కీలక నేతలంతా ఈ కుంభకోణం(Scam)లో ఇరుక్కున్నారు. తన అరెస్టు విషయంలో BJPపై ఎంతగా వ్యతిరేక ప్రచారం చేసినా ఎన్నికల్లో పనిచేయలేదు.
* లగ్జరీ లెవెల్లో కోట్లాది రూపాయలతో కేజ్రీవాల్ నిర్మించుకున్న ‘శీష్ మహల్’నే లక్ష్యంగా చేసుకుంది మోదీ బృందం. ప్రజాధనం ఎలా వృథా అయిందో కళ్లకు కట్టింది కమలదళం.
* ప్రజల ఆకాంక్షలను మరచిపోయి కేవలం రాజకీయ అంశాలు మాట్లాడటం, BJPని లక్ష్యంగా చేసుకోవడంతో అభివృద్ధి అటకెక్కింది.
* గత పదేళ్లలో కేంద్రంతో ఎలాంటి సఖ్యత లేకపోగా, లెఫ్టినెంట్ గవర్నర్(LG)తో రోజూ తగవులే. తమకు నిధులు రావట్లేదని ఆరోపించడం మినహా కొంతకాలం రాజకీయాలు పక్కనపెట్టి అభివృద్ధి కోసం ముందుకు వెళ్దామన్న ఆలోచన లేకపోవడం.
* ఇక కాంగ్రెస్ కూటమికి దూరంగా ఉండి ఒంటరిగా పోటీ చేయడం AAPకు నష్టం చేసింది. ఇండీ కూటమిలోని కాంగ్రెస్, ఆప్ వేర్వేరుగా పోటీచేయడం వృథా అయింది.
* NDA పక్షాలన్నీ కమలం అభ్యర్థులకు ప్రచారం చేస్తే… AAP, కాంగ్రెస్ కు మాత్రం వాటి మిత్రపక్షాలు ఏ మాత్రం సపోర్ట్ చేయలేకపోయాయి.
* తనను ఓడించాలంటే ప్రధాని మోదీ మరో జన్మ ఎత్తాలంటూ కేజ్రీవాల్ మాట్లాడటం కూడా వ్యతిరేకతను పెంచడానికి కారణమైంది.
* ఆరోగ్య రంగంలో సంస్కరణలు తెస్తామంటూ హామీ ఇచ్చి ఆ దిశగా నడిచినా.. అవినీతి అంశాలు ఆప్ నేతల్ని ముందుకెళ్లనీయలేదు.
* AAP కీలక నేతలు జైళ్లకు వెళ్లడంతో ఆ పార్టీలోని మిగతా ప్రధాన నేతలు కాషాయ కండువా కప్పుకున్నారు. దీంతో పలు చోట్ల BJP సునాయాసంగా గెలవగలిగింది.