BJP ఎంపీ సోయం బాపూరావు కామెంట్స్ కు నిరసనగా లంబాడీలు.. ఆ పార్టీ ఆఫీస్ ను ముట్టడించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ నాంపల్లిలోని BJP ఆఫీస్ కు చేరుకున్న వందలాది మంది.. బాపూరావు తీరుపై నినాదాలు చేశారు. MP మాట్లాడిన మాటలు తమను కించపరిచే విధంగా ఉన్నా, ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని లంబాడీ JAC లీడర్లు ఫైర్ అయ్యారు. వ్యాఖ్యలు వెనక్కు తీసుకోకపోతే BJPపై పోరును ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. BJP ఆఫీసులోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించిన నిరసనకారుల్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. JAC నాయకుల్ని అరెస్టు చేసి ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
లంబాడీలను ST జాబితా నుంచి తొలగించాలని సోయం బాపూరావు కొద్ది రోజుల క్రితం కామెంట్ చేశారు. దీనిపై ఆయా వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. సోయం మాటలు ఆయన వ్యక్తిగతమని, వాటితో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే పార్టీతో సంబంధం లేకుంటే ఆయనపై చర్యలు తీసుకోవాలి లేదా మాటల్ని వెనక్కు తీసుకునేలా చేయాలంటూ లంబాడీలు ఆందోళనకు దిగారు.