గత ఎన్నికల మాదిరిగానే తమ నాయకుడికి ఈసారి కూడా మొండి’చెయ్యి’ ఎదురవడంతో పటేల్ రమేశ్ రెడ్డి అనుచరులు గందరగోళం సృష్టించారు. దీంతో సూర్యాపేట కాంగ్రెస్ లో మరోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఇక్కణ్నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వం రాంరెండ్డి దామోదర్ రెడ్డికి దక్కింది. ఎన్నోసార్లు దామోదర్ రెడ్డి టికెట్ ఇచ్చారని, కానీ ఈసారి మాత్రం తనకు ఇవ్వాలని రమేశ్ రెడ్డి కోరుతున్నారు. 2018 ఎలక్షన్లలోనూ దామోదర్ రెడ్డికే టికెట్ కేటాయించారు. ఆ ఎన్నికల్లో ఆయన BRS అభ్యర్థి జగదీశ్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. వరుసగా ఓడిపోతున్నా టికెట్ ఇస్తున్నారంటూ రమేశ్ రెడ్డి వర్గీయులు ఆవేదనతో ఉన్నారు. ఈసారి కూడా రిక్తహస్తాలే ఎదురుకావడంతో ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ తరఫున రమేశ్ రెడ్డి నామినేషన్ వేశారు. దామోదర్ రెడ్డి, రమేశ్ రెడ్డి మధ్య విభేదాలు జగదీశ్ రెడ్డికి పాజిటివ్ గా మారుతున్నాయి.
ఈసారి కూడా ఓట్లు చీలకుండా ఉండాలన్న ఉద్దేశంతో పార్టీ సీనియర్లు మల్లు రవి, రోహిత్ చౌదరి.. రమేశ్ రెడ్డిని బుజ్జగించేందుకు సూర్యాపేటలోని ఆయన ఇంటికి వెళ్లారు. అక్కడ పటేల్ అనుచరులు రవిని రానీయకుండా అడ్డుకున్నారు. చివరకు ఇంట్లోకి వెళ్లిన రవి, చౌదరి ఎదుట రమేశ్ బోరున విలపించారు. మల్లు రవి, రోహిత్ వెంటనే వెళ్లిపోవాలని, లేదంటే ఇంట్లోనే ఉంచి తాళం వేస్తామంటూ పటేల్ అనుచరులు ఆందోళనకు దిగారు. ఒకానొక దశలో రవిని చుట్టుముట్టి తోసివేసే ప్రయత్నం చేశారు. మరోవైపు హైకమాండ్ పంపిన లీడర్లపై రమేశ్ రెడ్డి సైతం రివర్స్ అయ్యారు. దీంతో రమేశ్ తల్లిదండ్రులతో ఆ ఇద్దరు లీడర్లు చర్చలు జరిపారు. ఇలా కార్యకర్తలు సృష్టించిన ఆందోళనతో సూర్యాపేట కాంగ్రెస్ పార్టీలో గందరగోళం ఏర్పడింది.