
దక్షిణాదిలో క్రమక్రమంగా పాగా వేయాలనుకుంటున్న కమలం పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకే(ఆల్ ఇండియా అన్నాద్రవిడ మున్నేట్ర కజగం-AIADMK).. ఎన్డీయేతోపాటు BJPకి దూరంగా ఉండాలని నిర్ణయించింది. పార్టీ చీఫ్ ఎడప్పాడి కె.పళనిస్వామి నేతృత్వంలో సమావేశమైన పార్టీ కమిటీ… ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు మాజీ CM ప్రకటించారు. పార్టీ మెయిన్ ఆఫీస్ లో నిర్వహించిన మీటింగ్ కు రాష్ట్ర ఆఫీస్ బేరర్లు, జిల్లా సెక్రటరీలు అటెండ్ అయి ఈ డిసిషన్ తీసుకున్నట్లు వెల్లడిస్తూ సీనియర్ నేత కె.మునిస్వామి తీర్మానం చదివి వినిపించారు.
వ్యవస్థాపకుల్నే విమర్శిస్తారా…!
పార్టీ వ్యవస్థాపకులు(Founders)గా భావించే ‘అన్న(మాజీ CM దివంగత సి.ఎన్.అన్నాదురై)’, ‘అమ్మ(మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత)’ను తరచూ విమర్శలు చేస్తూ పార్టీ సిద్ధాంతాల్ని అగౌరవ పరుస్తున్నారంటూ అన్నాడీఎంకే కార్యవర్గం ఏకగ్రీవ నిర్ణయానికి వచ్చింది. తమిళనాడు BJP అధ్యక్షుడు అన్నామలై నేతృత్వంలోని పార్టీ లీడర్లు తమ అధినేతల్ని లక్ష్యంగా చేసుకుంటున్నారన్న భావనతోనే కమలం పార్టీకి దూరంగా ఉండాలని తీర్మానించామన్నారు. దీనిపై గత ఆగస్టు 20న మదురైలో జరిగిన పార్టీ సమావేశంలోనే నిర్ణయానికి వచ్చినా వేచి చూసే ధోరణి అవలంబించినట్లు అన్నాడీఎంకే వర్గాలు అంటున్నాయి.
లోక్ సభ సీట్లకు విఘాతమే…
ఈ నిర్ణయంతో వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కమలం పార్టీకి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. విపక్ష ఇండియా కూటమికి భిన్నంగా పెద్దయెత్తున పార్టీలు తమతో కలిసివస్తాయని NDA భావిస్తున్న టైమ్ లో అన్నాడీఎంకే తీసుకున్న నిర్ణయం నిజంగా మింగుడుపడనిదే. దక్షిణాది రాష్ట్రాలను పరిశీలిస్తే కర్ణాటక మినహా BJP సొంతంగా అధికారంలోకి వచ్చే రాష్ట్రం మరొకటి లేదన్నది విశ్లేషకుల మాట. తెలంగాణ, కేరళలో కేడర్ బలంగా ఉన్నా.. ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో మాత్రం పొత్తులతో తప్ప ముందుకెళ్లలేని సిట్యుయేషన్ అయితే ఉంది. అసెంబ్లీ ఎన్నికలను అటుంచితే ఆయా రాష్ట్రాల్లో జరిగే లోక్ సభ సీట్లను సాధించడం NDA కూటమికి ఎంతో ముఖ్యం. ఇప్పటికే విపక్ష ఇండియా కూటమిలో DMK కీలకంగా వ్యవహరిస్తుంది. ప్రతి ఎన్నికల్లోనూ ప్రభుత్వాలు మారే తమిళ రాజకీయాల్లో.. ఇప్పుడు అన్నాడీఎంకేకు దూరమవడం మోదీ సర్కారుకు ఇబ్బందికర పరిణామమే.