గులాబీ పార్టీకి తగులుతున్న ఎదురుదెబ్బలు ఆగేలా కనిపించడం లేదు. ఇదివరకే ఆరుగురు MLAలు, ఎనిమిది మంది MLCలు తమ దారి తాము చూసుకుంటే వారికిప్పుడు ఇంకొకరు జత కలిశారు. ఊహాగానాల(Speculations)కు తెరదించుతూ గద్వాల శాసనసభ్యుడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం నుంచి కృష్ణమోహన్ వరుసగా రెండుసార్లు విజయం సాధించారు. మాజీ మంత్రి డీకే అరుణపై గెలుపొందిన ఆయన.. హస్తం పార్టీలో చేరుతున్నారంటూ వారం నుంచి విపరీతమైన ప్రచారం జరిగింది. ఇంతలో ఆయన పేరు అలా ఉండిపోగా.. ఆరుగురు MLCలు అమావాస్య ఉందంటూ అర్థరాత్రి పూట CM చేత కండువా కప్పుకున్నారు.
రేవంత్ ఇంటికి వెళ్లిన గద్వాల MLA.. దీపాదాస్ మున్షీ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. 38 మంది శాసనసభ్యులు గల BRSను ఇంతకుముందే ఆరుగురు(ఖైరతాబాద్, స్టేషన్ ఘన్పూర్, భద్రాచలం, బాన్సువాడ, జగిత్యాల, చేవెళ్ల) వీడారు. ఇప్పుడు కృష్ణమోహన్ తో ఆ సంఖ్య ఏడుకు చేరగా.. గులాబీ పార్టీ సంఖ్య 31కి పడిపోయింది.