
టికెట్ల కోసం కాంగ్రెస్ పార్టీలో వేడి రాజుకుంటుండగా.. ముఖ్యమైన లీడర్ల మధ్యే విభేదాలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లోని పలు నియోజకవర్గాల్లో నువ్వా నేనా అన్నట్లు ప్రచారం సాగిస్తుండగా.. ప్రత్యర్థి వర్గాలతో లీడర్లు సమావేశాలు నిర్వహిస్తున్నారు. నిన్న జూబ్లీహిల్స్ లోనూ ఇరువర్గాల విభేదాలు బయటపడ్డాయి. టికెట్ రేసులో ఉన్న విష్ణు, అజహరుద్దీన్ టీమ్ ల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ఇప్పటికే విష్ణు వర్గానికి చెందిన నాయకుల్ని అజహర్ కలుసుకున్నారు. వారితో స్పెషల్ మీటింగ్ ఏర్పాటు చేసి మరీ.. వివిధ ప్రోగ్రామ్స్ లో పాల్గొన్నారు. ఇప్పుడు ఇది ఎల్.బి.నగర్ కు పాకింది. గతంలో నిజామాబాద్ MPగా పనిచేసిన మధుయాష్కీగౌడ్ ఎల్.బి.నగర్ నుంచి పోటీకి అప్లయ్ చేయడంపై పెద్దయెత్తున నిరసనలు వినిపిస్తున్నాయి. ఆయనకు వ్యతిరేకంగా ఏకంగా గాంధీభవన్ లోనే పోస్టర్లు అంటించారు.
‘సేవ్ ఎల్.బి.నగర్ కాంగ్రెస్’ పేరుతో పోస్టర్లు కనిపించగా.. పారాచూట్ నాయకులకు టికెట్లు ఇవ్వొద్దంటూ రాశారు. ‘గో బ్యాక్ టూ నిజామాబాద్’ అంటూ మధుయాష్కీపై వ్యతిరేక నినాదాలు రాసిన పోస్టర్లు ఆసక్తికరంగా మారాయి. PCCలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న మధుయాష్కీ.. AICC పెద్దలతోనూ చాలా దగ్గరి సంబంధాలున్నాయి. నేరుగా రాహుల్ తోనే ఆయన మంతనాలు సాగిస్తారన్న పేరుంది. అలాంటి మధుయాష్కీ ఎల్.బి.నగర్ నుంచి పోటీకి దిగాలనుకోవడం, ఇప్పటికే అక్కడ ఆశావహులు ఉండటంతో టికెట్ ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది.