
2016 నుంచి 2019 మధ్య కాలంలో ఇన్ ఫ్రా సంస్థ సబ్ కాంట్రాక్టుల ద్వారా రూ.118 కోట్ల ముడుపులు చేతులు మారాయన్న ఆరోపణలతో చంద్రబాబు చుట్టూ ఉచ్చు బిగుసుకున్నట్లే కనపడుతోంది. అయితే ఇది TDP, YSRCP మధ్య అగ్గి రాజుకునేలా చేసింది. సబ్ కాంట్రాక్టుల ముడుపులతోపాటు 2020-21కు సంబంధించి రూ.118 కోట్ల లెక్కలు చెప్పలేదంటూ ఇన్ కమ్ టాక్స్ డిపార్ట్ మెంట్ 153C సెక్షన్ ప్రకారం మాజీ ముఖ్యమంత్రికి నోటీసులు జారీ చేసింది. టిడ్కో ఇళ్ల నిర్మాణంలో రేట్లు పెంచి కన్స్ స్ట్రక్షన్ కంపెనీల నుంచి ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలపై నాలుగేళ్లుగా కేంద్ర ఆదాయపన్ను శాఖ విచారణ చేస్తున్నది. ఈ రెండు స్కామ్ ల్లో చేతులు మారింది.. అందులో ఉన్నది ఒక్కరేనని AP CID అనుమానిస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు కీలక కామెంట్స్ చేశారు. రేపో, ఎల్లుండో తనను అరెస్టు చేస్తారని, దాడి కూడా చేయబోతున్నారన్నారు. ఈ పరిణామం AP పాలిటిక్స్ ను గరం గరంగా మార్చేయగా.. చంద్రబాబు సైతం YSRCPపై విరుచుకుపడుతూ దారుణ రీతిలో విమర్శలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిది తప్పుడు పుట్టుక అంటూ వివాదాస్పద కామెంట్స్ చేయడంతో అధికార పార్టీ దీటుగా స్పందిస్తున్నది.
YCP నేతల ఎదురుదాడి
చంద్రబాబు మాటలపై YSRCP నేతలు ఎదురుదాడికి దిగారు. చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకే చంద్రబాబు డ్రామాలకు తెరతీస్తున్నారని… ఇన్నేళ్ల జీవితంలో తప్పు చేయలేదని, నేను నిప్పు అంటూ మభ్యపెట్టాలని చూస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. అడ్డంగా బుక్కయినా దబాయింపులకు పాల్పడుతూ తప్పించుకోలేరని, కేసుల నుంచి బయటపడేందుకు 25 ఏళ్ల నుంచి స్టే లు తెచ్చుకున్నారని ఫైర్ అయ్యారు. మంత్రులు గోవర్ధన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, అంబటి రాంబాబు సహా పలువురు నేతలు బాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.