
Published 18 Dec 2023
జమ్మూకశ్మీర్ కు గల ప్రత్యేక ప్రతిపత్తిని తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి క్లారిటీ ఇచ్చారు. విశ్వంలో ఏ శక్తికీ ‘ఆర్టికల్ 370’ని తిరిగి తీసుకువచ్చే అవకాశం లేదని అన్నారు. దేశంలో రెండు రాజ్యాంగాలు కాదు ఉండాల్సింది.. కేవలం ఒకే ఒక రాజ్యాంగం అన్న సుప్రీంకోర్టు మాటల్ని ఆయన గుర్తు చేశారు. ‘ఆర్టికల్ 370’ రద్దుతో జమ్మూ, కశ్మీర్, తద్దాఖ్ ప్రాంతాల్లో కొత్త శకం(New Era) ప్రారంభమైందని మోదీ అన్నారు. ఇప్పటిదాకా టెర్రరిజానికి హబ్ గా ఉన్న ఆ రాష్ట్రం ఇక నుంచి టూరిజం హబ్ గా మారబోతుందని తెలిపారు.
భారత్ లో విలీనమైన తర్వాత జమ్ముకశ్మీర్ కూడా దేశంలో అంతర్భాగమేనని, అది అన్ని రాష్ట్రాలతో సమానమేనని సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం విస్పష్ట తీర్పునిచ్చింది. తాత్కాలిక అవసరాల కోసం మాత్రమే ఆర్టికల్ 370ని తీసుకువచ్చారని, యుద్ధ పరిస్థితుల వల్లే ఈ ఆర్టికల్ తెచ్చారని బెంచ్ తెలిపింది. దీనిపై కేంద్రం నిర్ణయాన్ని తప్పుపట్టలేమని కరాఖండీగా చెబుతూనే ఆర్టికల్ 370ని రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఉందని స్పష్టతనిచ్చింది. 370 అధికరణం(Article)ను కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్టు 5న రద్దు చేసి ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన సంగతి తెలిసిందే.