పార్టీ మారుతున్నారని వస్తున్న విమర్శలపై మాజీ మంత్రి డీకే అరుణ స్పందించారు. తనకు ఆ అవసరం లేదని, కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని కామెంట్స్ చేశారు. ‘పార్టీ మారే ఆలోచనే లేదు.. అసలు కాంగ్రెస్ పార్టీలో చేరే ప్రసక్తే లేదు.. హస్తం పార్టీ నాయకులు మైండ్ గేమ్ ఆడుతూ బుద్ధి చూపించుకుంటున్నారు.. పార్టీ మారుతున్నానని ప్రచారం చేస్తూ గందరగోళం సృష్టిస్తున్నారు.. BJP హైకమాండ్ తనను గుర్తించే పార్టీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చింది.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో పనిచేయడం అదృష్టం.. ఆయన నాయకత్వంలో పనిచేయాలంటే ఎంతో అదృష్టం ఉండాలి’ అని DK అరుణ క్లారిటీ ఇచ్చారు.
2018 ఎన్నికల్లో DK అరుణ గద్వాల నుంచి ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన ఆమె.. BRS అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు.
అనంతరం కొద్ది నెలల తర్వాత BJPలో చేరి అప్పట్నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. కానీ ఈ మధ్యకాలంలో పలువురు సీనియర్ నేతలపై అనుమానాలు ఏర్పడ్డాయి. కొంతమంది కమలం పార్టీని వీడి పోతున్నారంటూ వార్తలు రావడం, డీకే అరుణ కూడా అదే ఆలోచనలో ఉన్నారంటూ ప్రచారం జరుగుతున్నది. దీనిపై స్పందించిన ఆమె BJPని విడిచిపెట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.