కేసీఆర్ మంచోడా.. రేవంత్ రెడ్డి మంచోడా.. ఈ ప్రశ్నకు తమ నేతే గొప్ప అని ఎవరి పార్టీకి వారే చెప్పుకుంటారు. కానీ ఈ ఇద్దరిలో ఒకరే మంచి వ్యక్తి అని ఆ రెండు పార్టీల నుంచి కాకుండా మూడో పార్టీకి చెందిన వ్యక్తి అందునా ముఖ్య లీడర్ చెబితే ఎలా ఉంటుంది. ఇప్పుడు అచ్చంగా అలాగే జరిగింది. నిజామాబాద్ MP ధర్మపురి అర్వింద్ ఇలాంటి హాట్ కామెంట్స్ చేస్తూ సంచలనం రేపారు. రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్ మంచోడు అని, PCC ప్రెసిడెంట్ లాంటి వ్యక్తి రాజకీయాల్లోనే లేడని అర్వింద్ అన్నారు. జగిత్యాల జిల్లా మెట్ పల్లి బూత్ లెవెల్ మీటింగ్ లో పాల్గొన్న ఆయన.. ఈ కీలక కామెంట్స్ చేశారు. ‘రేవంత్ కేసీఆర్ ను మించిన మోసగాడు.. ఆయన్ను మించిన మోసగాడు రాజకీయాల్లోనే లేడు.. నేను KCRతోని కొట్లాడుత కదా.. రేవంత్ కంటే కేసీఆర్ మంచోడు.. అతి భయంకరంగా తయారు చేస్తడు తెలంగాణను PCC ప్రెసిడెంట్’ అని చెప్పడంతో అంతా ఆశ్చర్యపోయారు.
అయితే హంగ్ లేదంటే BJP
రాష్ట్రంలో హంగ్ ఏర్పడుతుందని లేదంటే BJP ప్రభుత్వమే వస్తుందని అర్వింద్ అన్నారు. ‘అయితే మనకు మెజారిటీ వస్తది.. లేకపోతే హంగ్ అసెంబ్లీ వస్తది.. రెండు వచ్చినా ప్రభుత్వం మనమే ఫామ్ చేస్తం.. రాజకీయాలు ఎన్నికల కన్నా ముందు ఉంటయ్.. ఎలక్షన్ల తర్వాత ఉంటయ్.. ఎన్నికల తర్వాత రాజకీయాలు చేస్తరు.. నూటికి నూరు శాతం తెలంగాణలో భారతీయ జనతా పార్టీదే అధికారం’ అని అర్వింద్ చెప్పారు.