పార్టీ ఫిరాయించిన MLAల అంశంలో కీలక పరిణామం జరిగింది. BRS నుంచి కాంగ్రెస్ లో చేరిన 10 మందికి నోటీసులు జారీ చేస్తూ లిఖితపూర్వక సమాధానం చెప్పాలని అసెంబ్లీ కార్యదర్శి స్పష్టం చేశారు. అనర్హత వేటు వేసేలా చూడాలంటూ సుప్రీంకోర్టును KTR, కౌశిక్ రెడ్డి ఆశ్రయించారు. దీనిపై ఇప్పటికే స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శిపై సర్వోన్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. ఫిరాయింపులపై 4 నెలల్లో చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించినా అమలు కాలేదు. ఈ ఆదేశాల్ని ధిక్కరించారంటూ BRS నేతలు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. ఇంకెంతకాలం ఎదురుచూస్తారు.. మహారాష్ట్రలా అసెంబ్లీ గడువు ముగిసేవరకా అంటూ కోర్టు ప్రశ్నించడంతో నోటీసులు జారీ చేయాల్సి వచ్చింది.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ నుంచి గెలిచిన 10 మంది కాంగ్రెస్ లో చేరారు. తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని తొలుత BRS పిటిషన్ వేసింది. ఆ తర్వాత మరో ఏడుగురు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలె యాదయ్య, ప్రకాశ్ గౌడ్, అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, సంజయ్ కుమార్ ను కలిపి 10 మందిపై వేటు వేయాలంటూ సుప్రీంను ఆశ్రయించింది. KTR, కౌశిక్ రెడ్డి పిటిషన్లపై ఈనెల 10న విచారణ చేపట్టనుంది కోర్టు.